హైదరాబాద్ : గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ చేసినందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. వన్డే మ్యాచ్ లలో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డును సచిన్ వశం చేసుకోవడం దేశానికే గర్వకారణంగా నిలిచిందని సచిన్ ను బాబు కొనియాడారు. డబుల్ సెంచరీ ఆయన రికార్డు పుటల్లో వజ్రంగా మిగిలిఉంటుందని బాబు ప్రశంసించారు. 34 ఏళ్ల వయస్సులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశ ఖ్యాతిని చాటుతున్న సచిన్ క్రీడాస్ఫూర్తికి నిజమైన నిదర్శనమని ఆయన అభివర్ణించారు. సచిన్ స్ఫూర్తితో ఇతర క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ప్రతిష్ఠను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.