దార్శనికత లేని బడ్జెట్: జేపి హైదరాబాద్ : పేదరిక నిర్మూలనలో కీలకమైన ఉపాధి అవకాశాలు లేక ప్రాంతీయ ఉద్యమాలు పెచ్చరిల్లుతున్నాయని, ఈ వైఫల్యాన్ని సరిచేసేందుకు కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి దార్శనికతా కనిపించలేదని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పెదవి విరిచారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి నైపుణ్యాలు అందించకుండా పేదరికం పొరపాటున కూడా సమసిపోదని ఆయన అన్నారు. సామాన్యుడి శక్తిని పెంచి సమీకృత అభివృద్ధి సాధించే యత్నాల్లో గత బడ్జెట్ల మాదిరిగానే ఈ ఏడాది బడ్జెట్ కూడా విఫలమైందని వ్యాఖ్యానించారు. 2010 - 11 సంవత్సరపు సాధారణ బడ్జెట్ పై జేపి శుక్రవారం లోక్ సత్తా పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
స్థానిక ప్రభుత్వాలకు నిధులు కేటాయించకపోవడం, పేదరిక నిర్మూలనకు తగిన విధానాలు ప్రకటించకపోడం వల్ల ఈ బడ్జెట్ ఎలాంటి మౌలిక మార్పులనూ తేలేదని జేపి అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుల్లో రాష్ట్రాలకు 32 శాతాన్ని, ఇతర జాతీయ ప్రాయోజిత పథకాలతో కలపి సుమారు 3,80,000 కోట్లు అందించిన భారత ప్రభుత్వం కీలకమైన మూడో అంచె పాలనా వ్యవస్థకు కేవలం 1.5 శాతం అంటే 10 వేల కోట్లు కేటాయించడం నిరాశ కలిగించిందన్నారు. పేదరిక నిర్మూలనలో ప్రధాన భూమిక వహించే విద్య, ఆరోగ్యం, ఉపాధి నైపుణ్యాల పెంపులపై ఈ బడ్జెట్ లో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. విద్యకు 31 వేల కోట్లు, ఆరోగ్యానికి 22 వేల కోట్లు కేటాయించడమేమిటని జేపి నిలదీశారు.
ఉత్పాదకత పెంచి, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి గ్రామాలు - పట్టణాల మధ్య అగాథాన్ని తగ్గించే విధంగా కాకుండా కేవలం తాయిలాలు మాత్రమే కేంద్ర బడ్జెట్ పరిమితమైందని జేపి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రో ధరలు పెంచడాన్ని తప్పు పట్టలేమన్నారు. అయితే, ఆ భారం ప్రజల మీద పడకుండా చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందని అన్నారు. పెట్రోల్ రేట్లు పెంచినా సామాన్యులు ఇబ్బంది పడకుండా ప్రజా రవాణా వ్యవస్థ మీద అధికంగా సబ్సిడీలు ప్రకటించి ఉంటే కాస్త ఊరట కలిగేదన్నారు.
ద్రవ్య లోటను పరిమితం చేయడంతో పాటు ఆర్థిక ప్రగతిని కాలక్రమేణా పెంచే దిశగా తీసుకెళ్లేలా బడ్జెట్ రూపొందించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ప్రణబ్ సఫలమయ్యారని జేపి ప్రశంసించారు. యూనిక్ ఐడి కార్డుకు 1900 కోట్లు కేటాయించడం సానుకూల పరిణామం అన్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో బొగ్గుపై పన్ను విధించి సంప్రదాయేతర ఇంధన వనరుల పెంపునకు కృషి చేయడం స్వాగతించవచ్చన్నారు. ట్యాక్స్ బేస్ ను 12 శాతం నుంచి క్రమంగా 20 శాతానికి పెంచుకుంటూ విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో పెట్టుబడి పెడితే 10 శాతం అభివృద్ధి రేటను కనీసం దశాబ్దం పాటు నిలుపుకోగలిగితే భవిష్యత్తులో భారతదేశానికి తిరుగే ఉండదని జేపి అభిప్రాయపడ్డారు.
News Posted: 26 February, 2010
|