యువసత్తాకు జేపి దిశానిర్దేశం
హైదరాబాద్ : వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో మార్పు కోసం పోరాడగల 50 వేల మంది సమర్థులైన యువ నాయకులను తయారు చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. లోక్ సత్తా పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ యువజన విభాగం 'యువసత్తా' కొత్త రాష్ట్ర కార్యకవర్గం తొలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రత్నం, సలహాదారు డాక్టర్ పాండురంగారావు, ఉపాధ్యక్షురాలు జి. మంగళ, ప్రధాన కార్యదర్శులు రాజా రామకృష్ణ వర్మ, ఆంజనేయులు, రమణారెడ్డి, కార్యదర్శి శ్రీదేవి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని, యువతీ యువకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా కార్యక్రమాలు రూపొందించి, వెంటనే ప్రారంభించాలని యువసత్తా నేతలకు జేపి దిశా నిర్దేశం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే ఏర్పాట్ల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని, సమాజంలో మార్పు కోసం వారిని మలచాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం తేలిగ్గా చిక్కదని, లక్ష్యం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను ద్వేషించడం వల్ల ఫలితం లేదని, వాటిని చక్కదిద్దుకునే బాధ్యతను తీసుకుందామన్న స్పృహ కొరవడినందు వల్ల సమాజంలో ఆశించిన మార్పు రావడం లేదన్నారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలను తొలగింపజేసి, సరికొత్త రాజకీయం వైపు మళ్ళించడంలో యువసత్తా ప్రధాన పాత్ర పోషించాలని జేపి ఉద్బోధించారు.
News Posted: 27 February, 2010
|