'అజ్ఞానులే అబద్ధాలు చెబుతారు' హైదరాబాద్ : వాస్తవాలపై అవగాహన లేని వారు, తాము చేసే వాదనల్లో నిజాయితీ, పస లేని వారే ఇతరులపై అప్రజాస్వామికమైన, అసత్య ఆరోపణలు చెబుతుంటారని లోక్ సత్తా పార్టీ విరుచుకుపడింది. తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ మరికొందరు నాయకులు లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పై చేసిన వ్యక్తిగత దూషణలు, వ్యాఖ్యలను లోక్ సత్తా నాయకులు వి.లక్ష్మణ్ బాలాజీ, జి. రాజారెడ్డి, వి. విజయేందర్ రెడ్డి, డాక్టర్ పాండురంగారావు సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండని వారన్నారు. అభివృద్ధి సూత్రంగా చర్చలేవైనా జరిగినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుందన్నారు.
ప్రాంతీయ వాదాలను లోక్ సత్తా ఏనాడూ సమర్థించలేదని, కేవలం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే చేసిందని లోక్ సత్తా నాయకులు స్పష్టం చేశారు. ఏ సమస్యపైనైనా శాస్త్రీయ అధ్యయనం ద్వారా మాత్రమే తాము ప్రజలకు చేరువయ్యామన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల బాధలకు, చీరాలలో నేతన్నల బాధలకు తేడా లేదన్నారు. పాలమూరు వలసలు, శ్రీకాకుళం వలసలు ఒక్కటే అన్నారు. అవినీతి, అధికార కేంద్రీకరణతో సాగిన దుష్పరిపాలనే ఇందుకు ప్రధాన కారణం అని లోక్ సత్తా నాయకులు విశ్లేషించారు. అవినీతి ప్రాంతీయత లేదని, ప్రజలను దోచుకోవడమే సంప్రదాయ పాలకుల లక్ష్యం అని వారు దుమ్మెత్తిపోశారు.
అభివృద్ధి, వెనుకబాటుతనంపైన వాస్తవ గణాంకాలతో మాట్లాడాలని లోక్ సత్తా నాయకులు సూచించారు. వాస్తవాలను ప్రజలకు దూరంగా ఉంచి నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేయడం ఎవరికైనా తగదని హితవు చెప్పారు. చర్చలు ఎప్పుడూ సజావుగా, రాష్ట్ర ప్రజలందరి హితాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే జరగాలి తప్ప పరస్పర దూషణలు, వ్యక్తిగత విమర్శల ద్వారా కాదన్నారు. హేతుబద్ధత లేని నాయకత్వం వల్ల అందరికీ ముప్పే అని వారు హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా కొనసాగినా మౌలిక పరిస్థితులు మారవని, రాజ్య వ్యవస్థను సమూలంగా మార్చి అధికారాన్ని ప్రజల చేతుల్లో ప్రత్యక్షంగా పెట్టడం, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలకి పెద్ద పీట వేసి సర్వ శక్తులను అందుకు సమీకరించడం, అవినీతిని అంతం చేయడం, వికేంద్రీకరించిన ఆర్థికాభివృద్ధిని సాధించడం ఓట్లు కొనే రాజకీయాన్ని ప్రక్షాళన చేసి నీతి పునాదుల మీద పెట్టడమే సరైన పరిష్కారమని లోక్ సత్తా తొలి నుంచీ చెబుతున్నదన్నారు.
News Posted: 1 March, 2010
|