'హథీరాం' భూములు అమ్మొద్దు హైదరాబాద్ : దేశంలోని ఆరు కోట్ల మంది బంజారాల మనోభావాలకు విరుద్ధంగా అన్ని వర్గాల వారికీ ఆరాధ్యుడైన హథీరాం బావాజీ ట్రస్ట్ భూముల విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని టిడిపి రాష్ట్ర గిరిజన విభాగం రామావత్ లక్ష్మణ్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రధాన భక్తుడిగా ఆయన అనుగ్రహానికి పాత్రుడైన బంజారా హథీరాం బావాకు చెందిన సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 53 ఎకరాల భూమిని అతి తక్కువ ధర కేవలం 16 కోట్ల రూపాయలకే విక్రయించేందుకు యత్నాలు చేయడం తగదని ఆయన అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దల ఆశీస్సులతో మంత్రులు ఈ భూములను అప్పనంగా అప్పగించేందుకు యత్నాలు చేయడం తగదన్నారు. వందలాది ఏళ్ళుగా బావాజీ మఠానికి ఎందరో జమీందార్లు, రాజులు ఆస్తులు, విరాళాలు అందజేసిన ఘన చరిత్ర గల భూములను అక్రమంగా దిగమింగాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని లక్ష్మణ్ నాయక్ హెచ్చరించారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా నియంతలా వ్యవహరించి హథీరాం మఠం భూములను విక్రయించాలని చూస్తే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
News Posted: 2 March, 2010
|