'బిల్లు యథాతథమైతే వేస్ట్' హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును యథాతథంగా ఆమోదించి, అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అయితే, చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే బిల్లు ఆమోదం కోసం కేంద్రప్రభుత్వం సంకల్పిచడాన్ని ఆయన స్వాగతించారు. ప్రస్తుత మహిళా రిజర్వేషన్ బిల్లు లోపభూయిష్టమైనదన్నారు. బిల్లులోని లొసుగులను సరిచేయాలని ఆయన సూచించారు. పన్నెండేళ్ళ క్రితమే లోక్ సత్తా మహిళా రిజర్వేషన్ కోసం బిల్లును రూపొందించిందని దాని ఆధారంగా ప్రస్తుత బిల్లులో సవరణలు చేస్తే మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం లభిస్తున్నారు. మార్చి 8వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళాబిల్లుకు ఆచరణాత్మక ప్రత్యామ్నాయంపై జెపి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మహిళలకు టిక్కెట్లిస్తే గెలవలేరనే అసత్య ప్రచారంతో సంప్రదాయ పార్టీలు వారిని పక్కన పెడుతున్నాయని జేపి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి మహిళల పట్ల పార్టీలే కాని, ఓటర్లు వ్యతిరేకంగా కాదని గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. మహిళల పట్ల పార్టీలే వివక్ష చూపిస్తున్నాయి కాని ఓటర్లు కాదన్నారు. 1984 నుంచి గణాంకాలు చూస్తే పురుష అభ్యర్థుల కన్నా మహిళలే ఎక్కువ శాతం విజయాలు సాధించారని జేపి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 14 ఏళ్ళుగా పెండింగ్ లో ఉండడం మహిళా సాధికారత పట్ల రాజకీయ పార్టీల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. అసలు మహిళా బిల్లుతో ప్రమేయం లేకుండా పార్టీలే వారికి స్వచ్ఛందంగా మూడో వంతు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉన్నా లోక్ సత్తా తప్ప మిగతా పార్టీలేవీ ఎందుకు బహిరంగ ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
మహిళలకు పార్టీలే మూడో వంతు టిక్కెట్లు కేటాయంచేలా చట్టం చేయాలని జేపి డిమాండ్ చేశారు. నిజానికి జనాభాలో మహిళలు సగం ఉన్నారు కనుక 50 శాతం టిక్కెట్లు కేటాయించడం వాంఛనీయం అన్నారు. అలా చేయని పార్టీల గుర్తింపు రద్దు చేయాలని జేపి సూచించారు. లోక్ సత్తా రూపొందించిన ప్రత్యామ్నాయ బిల్లులోని అంశాలను ఈ సందర్భంగా జేపి వివరించారు.
News Posted: 4 March, 2010
|