వాళ్లు 2 ఇడియట్స్: సేన ముంబయి : బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఇద్దరూ 2 ఇడియట్స్ అని శివసేన మండిపడింది. ఐపీఎల్ లో పాక్ ఆటాగాళ్లకు స్థానం కల్పించడంపై వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై సేన తీవ్ర ఆగ్రహాన్ని వెలుబుచ్చుతూ షారుఖ్, అమీర్ లు 2 ఇడియట్స్ అని అభివర్ణించింది. పాకిస్తాన్ క్రికెటర్ లను తన కోలకతా నైట్ రైడర్స్ జట్టులో చేర్చుకుంటామంటూ షారుఖ్ చేసిన ప్రకటనను శివసేన దుయ్యబట్టింది. అలాగే బాగా ఆడే క్రీడాకారులు ఏ దేశం వారైనా జట్టులో చేర్చుకోవడంలో తప్పులేదు, వారి ఏ దేశం వారన్నది ప్రాధాన్యం కాదని అమీర్ చేసిన వ్యాఖ్యలపైనా శివసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
షారుఖ్, అమీర్ ల ఫోటోలతో డిజిటల్ చిత్రాన్ని రూపొందించి దానిపై 2 ఇడియట్స్ అని పతాక శీర్షీక పెట్టి సేన కార్యకర్తులు తమ నిరసనను తెలిపారు. అంతేగాక షారుఖ్ నటించిన సినిమాలను ఇకపై తన జిల్లాలో ప్రదర్శించనీయబోమని సేనకు చెందిన థానే ప్రాంత నాయకుడు ఏక్ నాథ్ షిండే హెచ్చరించారు. అలాగే శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, షారుఖ్ క్రికెట్ ఆడాలంటే లాహోర్ వెళ్లి ఆడుకోవాలని, ఇండియాలో కాదని హెచ్చరిక జారీ చేసారు.
News Posted: 30 January, 2010
|