క్షణాల్లో చార్జయ్యే బ్యాటరీ
లండన్: బ్యాటరీ డిశ్చార్జ్ కావడం సెల్ ఫోన్ వినియోగదారులు తరచూ ఎదుర్కొనే సమస్య. దాంతో వారు ఈ లోకంతో సంబంధాలు తెగిపోయినంతగా బాధ పడుతుంటారు. ఒంటరితనం వారిని వేధిస్తుంది. నిజమే అనానిమిటీ (అపరిచితత్వం) రాజ్యమేలుతున్న నగరాల్లో, జనారణ్యంలో ఒంటరితనాన్ని పోగొట్టే ఏకైక సాధనంగా సెల్ ఫోన్ నిలిచింది. అలాంటి సందర్భంలో సెల్ ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ కావడమంటే జవసత్వాలు పూర్తిగా కోల్పోయినట్లు సదరు వ్యక్తులు భావించడం జరుగుతుంది. తిరిగి చార్జింగ్ చేసుకునేంత దాకా మనిషిలో మనిషిగా ఉండక పోవడం కూడా జరుగుతుంది. అలాంటి వారి సమస్యకు అద్భుత పరిష్కారంలా క్షణాల్లో చార్జ్ కాగల బ్యాటరీలను అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. దాంతో గంటల కొద్దీ చార్జింగ్ చేసే బాధ తప్పుతుంది.
మస్సాచూట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీర్లు సాధారణ బ్యాటరీ ముడి పదార్ధాల ద్వారా సెకన్లలో చార్జింగ్ కాగల బ్యాటరీలను రూపొందించారు. చిన్న, తేలికపాటి బ్యాటరీలను అత్యంత వేగంగా చార్జింగ్ చేసేందుకు వీరు రూపొందించిన పద్దతి ఉపకరిస్తుంది. ఆ ఇన్ స్టిట్యూట్ కు చెందిన గెర్బ్రాండ్ సెడెర్, రిచర్డ్ పి సిమ్మన్స్ లు వీటి కోసం కృషి చేసారు. ఈ బ్యాటరీల్లో వినియోగించిన పదార్ధం పాతదే అయినప్పటికీ, వాటిని రూపొందించిన పద్ధతిని మార్చడం ద్వారా ఈ అద్భుతాన్ని వారు సాధించగల్గారు. ఎక్కువ శక్తిని నిక్షిప్తం చేసుకోగల బ్యాటరీలుగా లిథియమ్ రిచార్జిబుల్ బ్యాటరీలకు పేరుంది. అయితే ఆ బ్యాటరీలు చార్జ్ కావడానికి, డిశ్చార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది.
లిథియమ్ అయాన్లు ఏర్పరచిన బొఫిన్లు కారణంగా బ్యాటరీ పొడవున ఎలక్ట్రాన్లు ఆవరిస్తాయి. ఇవి ఆ పదార్ధం వెంబడి చాలా నిదానంగా చలిస్తాయని సాంప్రదాయకంగా కొనసాగుతున్న నమ్మకం. అయిదేళ్ల క్రితం సెడర్, అతని సహచరులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. బ్యాటరీల్లో సాధారణంగా వాడే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ పదార్ధంలోని లిథియం అయాన్లు అత్యంత వేగంగా చలించే విషయాన్ని కంప్యూటర్ గణాంకాల ద్వారా వారు అంచనా వేశారు. కొన్ని గణాంకాల ద్వారా లిథియం అయాన్లు అత్యంత వేగంగా చలించ గలవన్న విషయాన్ని నిర్ధారించుకోగల్గారు.
News Posted: 13 March, 2009
|