బంగారు బావిలో ముఖేష్!
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్ డి6 బావి సముద్రంలో దొరికిన బంగారు గని. ఈ బావిలో కనుగొన్న చమురు, సహజవాయువు పరిమాణం అపారం. డి6 నుంచి వెలికి తీసే సహజవాయువు విక్రయం, సరఫరాపై అంబానీ సోదరుల మధ్య సాగుతున్న సుదీర్ఙమైన న్యాయపోరాటంపై ఇంప్పటికే మీడియాలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు, వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వివాదంలో తెరమరుగైపోయిన కీలకమైన అంశం ఒకటుంది. అదే సహజవాయువు రవాణా వ్యవస్థ. డి6 బావి నుంచి వెలికితీసిన సహజవాయువు రవాణా కోసం కాకినాడ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని బారూచ్ నగరం వరకు భారీ స్థాయిలో నిర్మించిన పైప్ లైన్ నెట్ వర్క్ ఈ ప్రాజెక్ట్ లో కీలకమైన పాత్ర పోషించబోతోంది.
రిలయన్స్ గాస్ ట్రాన్స్ పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్స లిమిటెడ్ (ఆర్జీటిఐఎల్) అనే సంస్థ డి6 నుంచి గాస్ రవాణా కోసం ఈ పైప్ లైన్ నెట్ వర్క్ నిర్మించింది. అయితే దీని యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ కాదు. రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ దీని యజమాని. ఆర్జీటిఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమేయం ఎంత మాత్రం లేదు. మూడేళ్ళ క్రితం జరిగిన ఈ మార్పు చాలా వరకు ఎవరి దృష్టిలో పడకుండానే ఉండిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్ వ్యాపారంలో కీలకమైన పాత్ర పోషించబోతోంది ఆర్జీటిఐఎల్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పిన ఈ సంస్థను 2006లో ముఖేష్ అంబానీకి పూర్తిగా సొంతమైన రిలయన్స్ యుటిలిటీస్ అనుబంధ సంస్థగా మార్పు చేశారు. రిలయన్స్ యుటిలిటీస్ కింద ఉన్న మొత్తం ఎనిమిది కంపెనీలలో ఆర్జీటిఐ కూడా చేరింది.
కృష్ణా గోదావరి బేసిన్ లో కనుగొన్న గ్యాస్ నిక్షేపాలను సరఫరా చేసేందకు దేశ వ్యాప్తంగా పైప్ లైన్ నెట్ వర్క్ నిర్మించే సర్వహక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్జీటిఐఎల్ కు కట్టబెట్టింది. ఆర్జీటిఐఎల్ లో రిలయన్స్ పెట్టుబడి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. ఆ విధంగా ఆవిర్భవించిన ఆర్జీటిఐఎల్ గ్యాస్ రవాణా కోసం 4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా కాకినాడ నుంచి బారూచ్ వరకు 1,400 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేసింది. దేశ తూర్పు, పశ్ఛిమ ప్రాంతాలను కలుపుతూ మరో నాలుగు పైప్ లైన్ ప్రాజెక్ట్ లను ప్రారంభించింది. ఇవి కాకినాడ - హల్దియా (1,100 కిమీ), కాకినాడ - చెన్నై (670 కిమీ), చెన్నై-ట్యూటికోరిన్ (670 కిమీ), చెన్నై-బెంగళూరు-మంగళూరు (660 కిమీ). ఎరువులు, విద్యుత్ రంగాలకు చెందిన రిలయన్స్ కస్టమర్లకు గ్యాస్ రవాణా చేయడం ద్వారా ఆర్జీటిఐఎల్ ఒక ఎంబిటియు (మిలియన్ బ్రిటిష్ థెర్మల్ యూనిట్స్) గ్యాస్ కు రవాణా చార్జీల కింద సగటున 1 డాలర్ ఆర్జిస్తుంది.
కెజి బేసిన్ లోని డి6 బావి నుంచి రోజుకు సగటున 80 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను సరఫరా చేయడం ద్వారా ఆర్జీటిఐఎల్ రోజుకు 2 నుంచి 2.5 మిలియన్ డాలర్లను ఆర్జించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. డి6లో లభించే గ్యాస్ మొత్తాన్ని విక్రయించడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ 19.98 బిలియన్ డాలర్లు ఆర్జించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ విధంగా చూస్తే ఆర్జీటిఐఎల్ నిర్మించే పైప్ లైన్ నెట్ వర్క్ నుంచి లభించే ఆదాయం ముఖేష్ అంబానీకి సిరులు పండించబోతుండగా, అపార గ్యాస్ నిక్షేపాలతో విలసిల్లుతున్న డి6 బావి అంబానీలకు కామధేనువులా మారబోతోంది.
News Posted: 21 July, 2009
|