నాన్ స్మోకర్లకు మరో సౌకర్యం
ముంబై : దురలవాట్లు లేకపోవడం మంచిదని పెద్దల సూక్తి. జీవిత బీమా సంస్థలు ఈ సూక్తిని తుచ తప్పక పాటిస్తున్నాయి. ధూమపానం చేయని వ్యక్తులు తక్కువ ప్రీమియం చెల్లించే విధంగా బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఒక పాలిసీని ప్రవేశపెట్టింది. ఏగన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా అటువంటి పాలిసీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇప్పుడు ప్రవేశపెట్టిన టెర్మ్ పాలిసీని అత్యున్నత స్థాయి వ్యక్తుల (హెచ్ఐఎన్ ల)కు మాత్రమే ఉద్దేశించినది. వారిలో ధూమపానాసక్తులకు, ధూమపానం చేయని ఆరోగ్యవంతులకు మధ్య తేడా చూపుతున్నారు.
ఎవరైనా ఒక వ్యక్తి గడచిన ఐదు సంవత్సరాలుగా ధూమపానానికి స్వస్తి చెప్పి ఉంటే, కుటుంబంలో ఎవరికీ వ్యాధులు లేకుండా ఉంటే సదరు వ్యక్తి నుంచి కోటి రూపాయల పది సంవత్సరాల టెర్మ్ పాలిసీకి ప్రీమియంగా రూ. 11,500 మాత్రమే వసూలు చేస్తారు. అదే పొగతాగేవారి నుంచి రూ. 13 వేల మేరకు ప్రీమియం వసూలు చేస్తారు. అయితే, ఆ వ్యక్తి అసలు ఎన్నడూ పొగతాగని వాడై ఉంటే అతను పది సంవత్సరాల టెర్మ్ పాలిసీకి వార్షిక ప్రీమియంగా రూ. 10,500 మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.
ఇప్పటి వరకు పాలిసీ నిర్ణయానికి సంబంధించి అంత తేడా చూపకుండానే ఫారమ్ నింపేటప్పుడు దరఖాస్తుదారులు స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్ ఆప్షన్ పై ఒక టిక్ చేయవలసిందిగా జీవిత బీమా సంస్థలు కోరుతున్నాయి. 'పొగతాగేవారు ఎక్కువ రిస్క్ ఉన్న కస్టమర్ కనుక కొన్ని కేసులలో అధిక రేటుతో ప్రీమియం వసూలు చేస్తున్నాం' అని ఒక ప్రముఖ జీవిత బీమా సంస్థ పాలిసీల విభాగం అధిపతి తెలియజేశారు. 'ఆరోగ్యకరమైన జీవన సరళికి, మంచి అలవాట్లకు ప్రతిఫలం కల్పించడమే ప్రధాన లక్ష్యం. కస్టమర్ ధూమపానం అలవాట్లు, కుటుంబ చరిత్రను బట్టి ప్రీమియం తగ్గింపు జరుగుతుంది. అంటే సదరు కస్టమర్ ధూమపానం చేయనివాడైతే తక్కువ ప్రీమియం చెల్లించవలసి ఉంటుందన్న మాట. కుటుంబ ఆరోగ్య చరిత్ర బాగుంటే ఇంకా తక్కువగానే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది' అని ఆయన వివరించారు. సంస్థ పొందుపరచిన పాలిసీ వివరాలను కస్టమర్లు చదవవలసి ఉంటుంది.
జీవిత బీమా మార్కెట్ వృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి పాలిసీలు సర్వసాధారణమని, ఆ దేశాలలో అసలు ఏ దురలవాట్లూ లేని వారికి ప్రతిఫలంగా తక్కువ ప్రీమియం మాత్రమే నిర్ణయిస్తుంటారని ఏగన్ రెలిగేర్ లైఫ్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.ఎస్. గోపాలకృష్ణన్ 'ఫైనాన్షియల్ క్రానికల్' విలేఖరితో చెప్పారు.
మరి దరఖాస్తుదారుని నాన్ స్మోకర్ గా ఎలా నిర్థారిస్తారు? 'శరీరంలో నికోటిన్ స్థాయిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. పొగాకు కలగలిగిన ఏ పదార్థాన్నైనా ఆ వ్యక్తి సేవించాడా లేదా అనేది ఈ పరీక్షలలో తేలుతుంది' అని గోపాలకృష్ణన్ చెప్పారు.
News Posted: 31 August, 2009
|