నగదు బదలీకి కొత్త పద్ధతి
ముంబై : ప్రసిద్ధ వెస్టర్న్ యూనియన్ నగదు బదలీ విధావం వలె దేశంలో అంతర్గతంగా నగదు చెల్లింపునకు ఒక ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) సంకల్పించింది. ఈ విధానం వల్ల ఎవరైనా బ్యాంకు ఖాతా లేనప్పటికీ బ్యాంకింగ్, ఎటిఎం, పిఒఎస్ (అమ్మకం కేంద్రం లేదా పాయింట్ ఆఫ్ సేల్) నెట్ వర్క్ ను ఉపయోగించుకొంటూ ఏ సమయంలోనైనా, ఎలక్ట్రానికల్ గా డబ్బును వెంటనే పంపడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుతం దేశంలో బ్యాంకు, చెక్కులు, డ్రాఫ్టులు, మనీ ఆర్డర్ల ద్వారా మాత్రమే నగదు బదలాయింపు జరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ద్వారానే అదీనూ బ్యాంకింగ్ వేళల్లో మాత్రమే ఎలక్ట్రానికల్ గా నగదు పంపవచ్చు. ఇతర పద్ధతులలో నత్తనడకన సాగే పోస్టల్ సౌకర్యాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ కొత్త విధానం వల్ల రాత్రింబవళ్ళు, వారంలో ఏడు రోజుల్లోను, అత్యల్ప చార్జీతో నగదు బదలీ చేయవచ్చు. వెస్టర్న్ యూనియన్ విధానంలో బదలాయించే నగదులో ఐదు శాతాన్ని ఫీజుగా వసూలు చేస్తున్నారు.
దేశంలో గల 70 వేల బ్యాంకు బ్రాంచ్ లు, 44 వేల ఎటిఎంలు, 4 లక్షల పిఒఎస్ టెర్మినల్స్, అసంఖ్యాకంగా ఉన్న పోస్టాఫీసులు ఈ కొత్త నెట్ వర్క్ లో భాగం అవుతాయి. ఆర్ బిఐకి చెందిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (ఎన్ఇఎఫ్ టి - నెఫ్ట్) వ్యవస్థ తన చెల్లింపులు, సెటిల్ మెంట్ విభాగాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ విభాగం విధులను క్రమంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) చేపడుతుంది. ఈ కార్పొరేషన్ ఆరు నెలల క్రితం మాత్రమే ఏర్పాటైంది. ఈ సంస్థ కొత్త వ్యవస్థను నిర్వహిస్తుంది. దీనిలో ఆర్ బిఐ నియంత్రణ, పర్యవేక్షక పాత్రను మాత్రమే పోషిస్తుంది.
వెస్టర్న్ యూనియన్ నెట్ వర్క్ ను విదేశాల నుంచి ఈ దేశంలో నగదు చెల్లించేందుకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కాని దేశం లోపల నగదు బదలీలకు కాదు. ఈ కొత్త వ్యవస్థ దేశం లోపల నగదు బదలాయింపు నెట్ వర్క్ గా మాత్రమే ఉంటుందని ఈ నిర్ణయంలో కీలక పాత్ర గల ఒక బ్యాంకర్ తెలియజేశారు. ఈ వ్యవస్థ ఇలా పని చేస్తుంది: ఒక కస్టమర్ నగదు చెల్లించినప్పుడు, అతనికి ఒక కోడ్ నంబర్ ఇస్తారు. అతను దానిని నగదు అందుకునే వ్యక్తికి తెలియజేస్తాడు. ఆ వ్యక్తి అప్పుడు ఏదైనా బ్యాంకు బ్రాంచ్ కు లేదా పిఒఎస్ కు లేదా ఎటిఎం కు వెళ్ళి కోడ్ ను ఉపయోగించి నగదు తీసుకుంటాడు.
ప్రస్తుత నెఫ్ట్ వ్యవస్థ తన పని వేళలకు మాత్రమే పరిమితం. వారంలో మామూలు రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, శనివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఇది పని చేస్తుంది. ఈ వేళల్లో కూడా రియల్ టైమ్ బదలీలు ఉంటాయనే హామీ లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ వారంలో మామూలు రోజుల్లో ఆరు సార్లు, శనివారం మూడు సార్లు మాత్రమే నగదు అభ్యర్థనలను పరిష్కరిస్తుంది. ఆదివారం ఇది అసలు పని చేయదు.
News Posted: 31 August, 2009
|