3జి వేలానికి ఐఎఎఫ్ అడ్డు
న్యూఢిల్లీ : మూడవ తరం (3జి) స్పెక్ట్రమ్ కోసం టెలిఫోన్ కంపెనీలు మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఆప్టికి ఫైబర్ (ఒఎఫ్) నెట్ వర్క్ కు వలస పోయేందుకు వైమానిక దళానికి మరింత వ్యవధి కావాలని రక్షణ మంత్రిత్వశాఖ కోరడం ఇందుకు కారణం. అంతే కాకుండా ఇప్పుడు 3జి స్పెక్ట్రమ్ వేలం నిర్వహించరాదని కూడా మంత్రిత్వశాఖ వాదించింది. ఈ వలస వచ్చే నెలాఖరులోగా జరగవలసి ఉంది. కాని జూన్ వరకు వ్యవధి ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖను ఒక లేఖలో కోరింది. ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లాకు కూడా ఇదే విషయాన్ని నివేదించారు.
రెండు మంత్రిత్వశాఖలు ఈ సంవత్సరం మే నెలలో ఒక అవగాహన పత్రం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం, టెలిఫోన్ కంపెనీలకు కమర్షియల్ కేటాయింపు కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి - డాట్)కు అనుకూలంగా 45 మెగా హెర్ట్ జ్ (2జికి 25 ఎంహెచ్ జి, 3జికి 20 ఎంహెచ్ జి)ని రక్షణ శాఖ ఖాళీ చేయవలసి ఉంటుంది. ఈ ఎంఒయు ప్రకారం, సైనిక దళాల కోసం ప్రత్యామ్నాయ ఆప్టిక్ నెట్ వర్క్ ను డిఒటి ఏర్పాటు చేస్తుంది. రక్షణ దళాలు ముందుగా మూడు నెలలలో 3జికి సంబంధించి 10 ఎంహెచ్ జి, 2జికి సంబంధించి 5 ఎంహెచ్ జిని విడుదల చేయగలమని సూచించాయి.
'2009 అక్టోబర్ నాటికల్లా వైమానిక దళం నెట్ వర్క్ ను పూర్తి చేయడానికి కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ సూచించిన వ్యవధిని సవరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 2010 జూన్ లోగా దీనిని అమలు పరచడం సాధ్యం కాదని వైమానికి దళం సూచించింది. ఆ తరువాత మాత్రమే ప్రస్తుత సర్వీసుల మార్పు జరగవచ్చు' అని డిఒటి కార్యదర్శి సిద్ధార్థ బెహురాకు రాసిన ఒక లేఖలో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. 'మొత్తం 3జి స్పెక్ట్రమ్ వేలం ఎంఒయు కింద రెండు మంత్రిత్వశాఖల మధ్య కుదిరిన అవగాహనకు విరుద్ధం కాగలదు. కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అలా ఏకపక్షంగా చర్య తీసుకోవడం వల్ల ఈ బ్యాండ్ లో ఇప్పుడున్న కీలకమైన రక్షణ పరికరాలు నిరుపయోగం కాగలవు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఆత్యయిక పరిస్థితి ఏదైనా ఏర్పడి ఈ సిస్టమ్ లను అమలులోకి తీసుకువచ్చినట్లయితే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు వినియోగిస్తున్న సిస్టమ్ లపై ఇటువంటి ప్రభావాలే పడవచ్చు' అని కూడా ఆ లేఖలో రక్షణ శాఖ పేర్కొన్నది.
వైమానిక దళం కోసం రూ. 1077 కోట్ల ఖర్చుతో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే బాధ్యతను కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఇప్పటికే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్)లకు అప్పగించింది. సైనిక, నౌకా దళాలకు కూడా ఇటువంటి నెట్ వర్క్ కోసం రూ. 8893 కోట్లు ఖర్చు కావచ్చు.
News Posted: 29 September, 2009
|