ఈ స్పెక్ట్రమ్ కథ ఇంతేనా?
న్యూఢిల్లీ : 3జి స్పెక్ట్రమ్ కోసం నాటకీయ వేలంపాటకు (అసలు వేలం పాటకు జనవరి 14 గడువు) నిర్ణయించిన జనవరి 11, 12 గడువు ఎటువంటి వేలంపాటా లేకుండానే గడిచిపోయింది. దీనితో మరొక గడువుకు కూడా గండి పడుతున్నదని భావించవచ్చు. టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి) రూపొందించిన, ప్రభుత్వ ఆమోదముద్ర ఇంకా పొందవలసి ఉన్న ముసాయిదా పత్రం ప్రకారం తాజాగా ఫిబ్రవరి 12న ఈ వేలంపాటను నిర్వహిస్తారు. అయితే, ఈ ప్లాన్ కింద స్పెక్ట్రమ్ కేటాయింపు సెప్టెంబర్ మాసంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆలోగా రక్షణ మంత్రిత్వశాఖ (ఎంఒడి) స్పెక్ట్రమ్ కు విముక్తి కల్పించకపోవచ్చు.
స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేయడానికి నిరీక్షిస్తున్నవారు ఉత్కంఠకు లోను కావలసిన అవసరం లేదు. 3జి స్పెక్ట్రమ్ గురించి మాట్లాడడం మూడేళ్ల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి గడువు మీద గడువు నిర్ణయిస్తూ వస్తున్నారు. మూడు సందర్భాలలో ఈ వ్యవహారాన్ని టెలికమ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి నివేదించారు. ముందు నిర్ణయించిన వ్యవధికి ఎంఒడి స్పెక్ట్రమ్ కు విముక్తి కల్పించేట్లు చూసేందుకు, కనీస వేలం ధరను నిర్ణయించడం కోసం మంత్రుల బృందాలు (జిఒఎంలు) దీనిపై పలు సమావేశాలు జరిపాయి కూడా. డిఒటి, ఎంఒడి మధ్య 2009 మేలో చివరిసారిగా సంతకాలు జరిగిన అవగాహన పత్రం (ఎంఒయు) క్రితం సంవత్సరం 3జి స్పెక్ట్రమ్ ను విడుదల చేయాలని సూచించింది. అయినప్పటికీ అలా జరగలేదు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రక్షణ దళాల కోసం ప్రత్యేకంగా ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ (ఒఎఫ్ఎన్)ను ఏర్పాటు చేయవలసి ఉంది. కాని బిఎస్ఎన్ఎల్ ఇంకా ఆ పని చేయలేదు. అంటే, ఫిబ్రవరి గడువు కూడా దాటిపోవచ్చన్నమాట. ఏమైనా జనవరిలో వేలం వేయవలసి ఉన్న నాలుగు 3జి స్లాట్లలో మూడింటినే వేలానికి పెట్టి, నాలుగవది బహుశా 2013లో వేలం వేసే సూచనలు కనిపిస్తున్నాయి.
జిఒఎం ప్రక్రియ కారణంగా సమస్య పరిష్కారం కాలేదని విదితమవుతున్నది. ప్రత్యేకంగా ఒఎఫ్ఎన్ ఏర్పాటు కార్యక్రమంలో ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రమేయం కల్పించాలని ప్రభుత్వం భావించి ఉండాలి. అటువంటప్పడు స్పెక్ట్రమ్ కు తుది సంరక్షక సంస్థ ఏదవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఈ బాధ్యత ప్రపంచంలో అనేక దేశాలలో వలె టెలికమ్ శాఖదా లేక రక్షణ శాఖదా? రక్షణ విభాగానికి తగినంత స్పెక్ట్రమ్ కేటాయించడం ముఖ్యమే. అయితే, స్పెక్ట్రమ్ కు ఇతర వినియోగదారులు కూడా ఉంటున్నందున దీనిని స్పష్టంగా నిర్వచించవలసి ఉంటుంది. తాను ఎప్పుడంటే అప్పుడు కోరుకున్న ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకునే హక్కు తనకు ఉందని రక్షణ శాఖ నిరంకుశంగా వాదించజాలదు. ఉపయోగించే స్పెక్ట్రమ్ పై 2007లో సమగ్రంగా పరిశీలన జరిగింది. కాని ఆ వివరాలను బహిర్గతం చేయకపోయినప్పటికీ, రక్షణ దళాలు మరీ ఎక్కువగా 3జి స్పెక్ట్రమ్ ను ఉపయోగించడం లేదని దీని వల్ల తెలుస్తున్నదని టెలికమ్ సంస్థలు పేర్కొన్నాయి. అంటే స్పెక్ట్రమ్ కు విముక్తి కల్పించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ నిరాకరిస్తున్నదని, దానికి ఒఎఫ్ఎన్ ఆవశ్యకత ఉందని విదితమవుతున్నది. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలోఆ శాఖకు నెట్ వర్క్ ను సమకూర్చవలసి ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఏదైనా లింక్ ఉందా అనేది తేలవలసి ఉంది. తాను 3జి స్పెక్ట్రమ్ తో నడుపుతున్న పరికరాలు ఏవో కనీసం ప్రభుత్వంలో ఎవరో కొద్ది మందికి వివరించాలని రక్షణ మంత్రిత్వశాఖను కోరాలి. జాతీయ భద్రత ముఖ్యమే. కాని వాణిజ్య పరమైన అవసరాలకు ఉపయోగించుకోకుండా నివారించడానికి దానిని ఒక కారణంగా పేర్కొనరాదు.
News Posted: 13 January, 2010
|