పాన్ లేదా? బాదుడే
బెంగళూరు: ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే వ్యక్తిగత ఖాతా నంబర్ (పాన్) ఇక కీలకం కానుంది. వ్యక్తులు గాని, సంస్థలు గాని ఇక నుంచి నిర్వహించే అన్ని ఆర్ధిక లావాదేవీలల్లోనూ పాన్ ను ఉటంకించడం తప్పని సరి కాబోతోంది. పాన్ కార్డు పేర్కొనకపోతే గోళ్లూడగొట్టే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. అదనంగా 20శాతం పన్నును విధించి, దాని టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్సు (టిడిఎస్)పద్దతిలో లాగేసుకుంటారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పద్దతిని అమలు చేస్తామని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
గత ఏడాది జూలై 6వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక బిల్లు ప్రవేశపెడుతూ పాన్‌కార్డు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చేసిన ప్రకటనకు అనుగు ణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆదాయం పొందుతున్న ప్రజలకు సంబంధించి సరైన గణాంకాలు సేకరించడానికి, ఆదాయ ఖాతాలను సక్రమంగా నిర్వహించడానికి, నగదు లావాదేవీలు పారదర్శకంగా కనిపించడానికి, ఆదాయపు పన్ను ఎగవేతలను అరికట్టడానికి వీలుగా దాదాపు పది సంవత్సరాల క్రితమే దేశంలో పాన్‌కార్డు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే గ్రామీణులు, నిరక్షరాస్యులు, ఆదాయపు పన్ను కిందకు రానివారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ విధానం సక్రమంగా అమలు కాలేకపోయింది.
అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బేసల్-2 నియమాలను అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడడంతో ప్రభుత్వం ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సంకల్పించింది. ఉదాహరణకు ఒక వ్యక్తి కాంట్రాక్టింగ్ వ్యాపారంలో ఉన్నాడనుకోండి. ఆ కాంట్రాక్ట్‌ను ఆ వ్యక్తికి ఇచ్చిన యజమాని లేదా సంస్థ నగదు చెల్లించేటప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194 సి కింద ఒక శాతం పన్ను మినహాయించుకుని ఇవ్వడం జరిగేది. ఇప్పుడు పాన్‌కార్డు లేని పక్షంలో ఆదాయపు పన్ను 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా జరిమానాతో సమానమన్నమాట. అలాగే ఇప్పట వరకు బీమా కమీషన్ మినహా ఇతర బ్రోకరేజ్ కమీషన్‌ల చెల్లింపులో 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించేవారు. ఇప్పుడు ఆ మొత్తం పాన్‌కార్టు లేకపోతే 20 శాతం కానుంది.
ప్లాంట్ లేదా మిషనరీ అద్దెకు సంబంధించి వచ్చే ఆదాయంలో 2 శాతం, భూమి లేదా భవనం లీజు విషయంలో 10 శాతం ఆదాయపు పన్ను కట్టేవారు ఇకపై పాన్‌కార్డు వివరాలు తెలియచేయకుంటే 20 శాతం పన్నుగా చెల్లించక తప్పదు. మూలంలో పన్ను చెల్లించే ఏ ఆదాయానికైనా రానున్న కొత్త విధానం వర్తిస్తుంది. అందులో భాగంగా ట్యాక్స్ హెవెన్ దేశాలుగా పేరుగాంచిన మలేషియా, మారిషస్, స్విట్జర్లాండ్ దేశాలలో ఉన్న భారతీయ ఖాతాలపై నివేదికలు తెప్పించుకోవడానికి ఆయా ప్రభుత్వాలతో మనదేశం సంప్రదింపులు జరుపుతోంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి రాకుండా పోతున్న లక్షలాది మంది ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి పాన్‌కార్డు విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు నిపుణులు భావిస్తున్నారు.
News Posted: 21 January, 2010
|