'రియల్' నిధులపై నిఘా
ముంబై : రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్న పెట్టుబడులపై ప్రభుత్వం ఒక కన్నువేసి ఉంచింది. ఏ స్థలాలు లేదా కట్టడాల ధరలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ధరలు అమాంతం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయేమోనని కనిపెట్టి ఉండాలని ప్రభుత్వం అనుకుంటున్నది. పట్టణ ప్రాంతాలలో నిరుడు అనేక నెలల పాటు తగ్గి ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు పెరగనారంభించాయి.
'ఈ రంగంలోకి వస్తున్న అన్ని రకాల నిధులపై కన్ను వేసి ఉంచాం. అయితే, వీటిని నియంత్రించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఆర్. గోపాలన్ చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు ఇవ్వడంపై బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) హెచ్చరించింది. ఈ రంగంలోకి వస్తున్న నిధులపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతుండాలని బ్యాంకులను ఆర్ బిఐ కోరింది. కాగా, రియల్ ఎస్టేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకులు తగ్గించాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం 2009 నవంబర్ 21 నాటికి రూ. 88,581 కోట్లుగా ఉన్నది. 2009 జూన్, నవంబర్ మధ్య ఈ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం రూ. 8000 కోట్ల మేరకు తగ్గింది. ఇటీవల ఒక కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఉషా థొరాట్ ప్రసంగిస్తూ, రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం ప్రమాదాన్ని తగ్గించేందుకై ఈ సంస్థలకు తాము ఇచ్చే రుణాలపై బ్యాంకులు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుందని సూచించారు. 'ఈ విషయంలో రెగ్యులేటరీ పరిమితి ఏదీ నిర్దేశించకపోయినప్పటికీ నిఘా వేయడం ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్యాంకు ఇచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఒక కన్నువేసి ఉంచుతుంది. అవసరమైన సందర్భాలలో సముచిత చర్యలు తీసుకుంటుంది' అని ఆమె తెలిపారు.
రియల్ ఎస్టేట్ రంగంలోకి అపరిమితంగా పెట్టుబడులు వస్తే ధరలు అవాస్తవికంగా, అసమంజసంగా పెరగవచ్చునని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆందోళన చెందుతున్నాయి. వాణిజ్య భవనాల నిర్మాణం ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నది. డిమాండ్ ను సప్లయి మించిపోయింది. తాము తీసుకున్న రుణాల కాలపరిమితిని తిరిగి మార్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా వరకు రుణాల చెల్లింపును వాయిదా వేయడమో లేక బకాయిలు పెట్టడమో జరుగుతోంది.
News Posted: 9 March, 2010
|