తేదేపా బ్రహ్మాస్ర్తం ఎన్టీఆర్
హైదరాబాద్ : టిడిపి అమ్ములపొదిలో ఉన్న మరో బ్రహ్మాస్త్ర్రం జూనియర్ ఎన్టీఆర్. ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతుండడంతో అన్ని పార్టీల కళ్ళన్నీ ఆయనపైనే ఉన్నాయి. ఏకబిగిన నలభై రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న కసితో ఆయన వ్యూహరచన సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సాధ్యమైనంత మేరకు స్వర్గీయ నందమూరి తారకరామారావును మురిపించేలా పక్క ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.
తేదేపా పక్షాన ఇప్పటికే నందమూరి బాలయ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ తుది షెడ్యూల్ కారణంగా కొద్ది రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉంటున్న బాలయ్య త్వరలోనే మరోసారి ప్రచారం చేసేందుకు సమాయాత్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా యువకులు, మహిళలు, చిన్నారుల్లో అమితమైన అభిమానాన్ని చూరగొన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావడం వల్ల పార్టీకి మరింత ఊపు రానుందన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తునారు. ఈ నేపథ్యంలో ఆయన మార్చి 12వ తేదీ నుంచి ఎన్నికల పర్వం ముగిసేంత వరకు ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఇది తేదాపా శ్రేణుల్లో మంచి హుషారును కలిగిస్తున్నది.
అధికార కాంగ్రెస్ను మట్టికరిపించేందుకు టిడిపి, తెరాస సిపిఎం, సిపిఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. నాలుగు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ ప్రాంతంలో దాదాపు 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలను సులువుగా విజయం సాధించవచ్చునని మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. దీనికి తోడు జూనియర్ ప్రచారం కూడా తోడు అయితే ఇక విజయానికి ఢోకా ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, మరోవైపు నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న కూడా ప్రచారంలో పాల్గొనడం వల్ల వోటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
ఇక తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు కూడా ఉండనే ఉన్నారు. అచ్చు తెలంగాణ భాషలో మాట్లాడుతూ వోటర్లను మత్తెక్కించనున్నారు. దీంతో పాటు పోరాటాల వీరులైన వామపక్షాల నాయకులు బి.వి.రాఘవులు, నారాయణ కూడా వోటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయడంలో దిట్ట.
అయితే టిడిపి వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ పోలికలతో పాటు తాతకు తగ్గ మనవుడుగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగితే అగ్నికి గాలి తోడైనట్లేనని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ఎవరూ తట్టుకోలేరన్న వాదన పార్టీవర్గాల్లో వినిపిస్తున్నది. ఇక మెగాస్టార్ ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ సినీగ్లామర్ ను అడ్డుకునే సత్తా కూడా జూనియర్ ఎన్టీఆర్ లో ఉందని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీకి బ్రహ్మాస్త్రం కానున్నారన్న ధీమాను నగర తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 11 February, 2009
|