చిదంబరం `హోమ్' రిపేర్లు
న్యూఢిల్లీ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి పళనియప్పన్ చిదంబరం తన మంత్రిత్వశాఖలో అదనపు సిబ్బందిని తగ్గించాలని, శాఖ పని తీరులో మొత్తం మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో రాజధానిలో ఉన్నతాధికార వర్గాలలో కలవరం రేగుతున్నది. దేశంలో భద్రత కల్పించవలసిన, శాంతి భద్రతలను పరిరక్షించవలసిన అత్యున్నత స్థాయి అధికారులతో కూడిన తన మంత్రిత్వశాఖలో అధికారులందరిపైన సమీక్ష నిర్వహించాలని చిదంబరం ఆదేశించినట్లు తెలుస్తున్నది.
వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేట్లు చూడడం, అసమర్థులను వదలించుకోవడం లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు. మంత్రిత్వశాఖ నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం ఈ పథకంలో ఒక ప్రధానాంశం. ముందుగా నియామకాలు, పోస్టింగ్ ల విషయంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తన సహాయ మంత్రులను స్వయంగా ఎంచుకున్న తరువాత తనకు పని జరగడం ముఖ్యమని స్పష్టమైన సంకేతాలు పంపిన చిదంబరం తన ప్రైవేట్ కార్యదర్శి ఎంపిక పనిలో నిమగ్నమయ్యారు.
చిదంబరం తన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నార్త్ బ్లాక్ కు 'మంచి, సమర్థులైన' ఇద్దరు సహాయ మంత్రులను నియమించవలసిందిగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు స్వయంగా విజ్ఞప్తి చేశారు. అజయ్ మాకెన్, ముల్లపల్లి రామచంద్రన్ ఇద్దరూ ఇంతకు ముందు తమ సత్తాను నిరూపించుకున్న మంత్రులే. ఢిల్లీ నగరంలో విచ్చలవిడిగా అనధికారికంగా సాగుతున్న నిర్మాణాల సమస్యను అధిగమించి, ప్రణాళికాబద్ధ వృద్ధి జరిగేట్లు చూసేందుకై 'ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2121'కు రూపకల్పన చేసిన ఘనత అజయ్ మాకెన్ దే. ఇక రామచంద్రన్ 1991 నుంచి పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో రెండు సంవత్సరాల పాటు సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నిజాయితీపరుడని చెబుతుంటారు.
ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళుతూ చిదంబరం తన సొంత కార్యదర్శి ఎంపికకు పారదర్శక ప్రక్రియను చేపట్టడం ద్వారా నార్త్ బ్లాక్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంత్రిత్వశాఖలో ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ మంత్రి కార్యాలయం ఇటీవల ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. దరఖాస్తుదారులలో కొందరితో ఒక జాబితాను చిదంబరం స్వయంగా రూపొందించి అందులో ఉన్న నలుగురిని ఇంటర్వ్యూ చేశారు. దాని ఫలితాన్ని ప్రకటించవలసి ఉంది. కేంద్ర హోమ్ శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ నియమించిన, ఐఎఎస్ అధికారి రాజీవి మిట్టల్ హోమ్ మంత్రిత్వశాఖ నుంచి మరొక శాఖకు మారిన తరువాత ప్రైవేట్ కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.
లోక్ సభ ఎన్నికలకు ముందు మంత్రిత్వశాఖ పునర్వ్యవస్థీకరణకు చిదంబరం ఆదేశించారు. ఆంతరంగిక భద్రత, పోలీసు డివిజన్లను విడదీయడం, నక్సల్ వ్యతిరేక విభాగాల విలీనం ఈ పునర్వ్యవస్థీకరణలో భాగం. విఐపి భద్రతను పోలీస్ ఆధునికీకరణ విభాగం నుంచి సంబంధిత డివిజన్ ఆంతరంగిక భద్రత విభాగం 2కు బదలాయించారు.
News Posted: 1 June, 2009
|