ఉన్న పదవీ ఊడేనా?
హైదరాబాద్ : రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా విజయతీరాలకు చేర్చిన వ్యక్తిగా పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నా పార్టీలో తంటాలు తప్పడం లేదు. పైకి ఎంత కలిసున్నట్టు కనిపించినా ముఖ్యమంత్రి వైఎస్, పార్టీ సారధి డిఎస్ ల నడుమ అంతర్గత విభేదాలు ఎప్పట్నుంచో కొనసాగుతున్నాయి. తాజా ఎన్నికలకు ముందు టిక్కెట్లు కేటాయింపులో ఈ ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం హస్తిన వరకు చేరుకుంది. ఎలాగోలా మాటనెగ్గించుకుని వచ్చిన డీఎస్ నిజామాబాదులో పరాజయం పాలవడం కొత్త ఇక్కట్లను తెచ్చిపెట్టింది. పార్టీలోని ప్రత్యర్థులకు సరికొత్త ఆయుధాన్ని అందించింది. ఇదే అదనుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షస్థానం నుంచి డీఎస్ ను తప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వినికిడి. ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరింపబడిన వ్యక్తిని పార్టీ సారధిగా ఉంచడం సరైందికాదనే వాదనతో కొంతమంది ఆయన వ్యతిరేకులు ఢిల్లీ పెద్దల చెవిలో పోరు పెడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఈ పదవినుంచి డీఎస్ ను తప్పించడానికి స్వయంగా వైఎస్సే ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు మళ్ళీ అంతర్గత పోరు ఊపందుకుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఎన్నికల్లో తాను ఓడిపోయినా, రాష్ట్రంలో పార్టీని గెలిపించిన ఘనత తనకు మంత్రి పదవిని తెచ్చిపెడుతుందని డీఎస్ ఆశించారు. కానీ, వైఎస్ కాబినెట్ లో డీఎస్ కు చోటు దక్కకుండా పోయింది. దాంతో ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించినప్పటికీ అధిష్టానం ఆయన మొరను ఆలకించలేదు. డీఎస్ కు మంత్రి పదవి ఇమ్మని రాష్ట్ర ఇన్ చార్జిగా ఉన్నా వీరప్ప మొయిలీ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ కు సిఫార్సు చేసారని చెబుతున్నారు. కానీ దీనిని వైఎస్ గౌరవించలేదని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం డీఎస్ ఓటమిని పరిగణనలోకి తీసుకోవడం వల్లే మంత్రి వర్గంలో చోటుకు అవకాశం కల్పించలేదని వారు పేర్కొంటున్నారు. `నా భవిత్యం అధిష్ఠానం చేతుల్లో ఉంది' అని డీఎస్ బహిరంగంగానే చెప్పుకున్నారు.
ఇప్పటికిప్పుడే పీసీసీ పీఠం కదలకపోయినా కనీసం ఆరు నెలల వ్యవధిలోనే అదిబీటలు వారే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ కు డీఎస్ కు తొలినుంచి సఖ్యతలేదని పార్టీ వర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. పైకి ఎలాంటి విభేదాలు లేవంటున్న వారి మధ్య నాయకత్వం విషయంలో కొన్ని పొరపొచ్ఛాలు లేకపోలేదని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంతో అధిష్ఠానం వద్ద వైఎస్ ప్రతిష్ట పెరిగింది. ఇది కూడా డీఎస్ కు కొంత ఇబ్బందికర పరిణామమని పేర్కొంటున్నారు.ఇదిలావుంటే డీఎస్ ఓటమికి కారణాలేంటో అధిష్ఠానానికి తెలుసని మరికొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. మీడియా వక్రీకరణ వల్ల హిందూ వ్యతిరేక ముద్ర డీఎస్ పై పడటంతోనే ఆయన విజయం సాధించలేకపోయారని చెప్పుకుంటున్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో డీఎస్, వైఎస్ సఫలీకృతం అయ్యారని, బెస్ట్ జోడిగా అధిష్ఠానం పేర్కొంటుందని డీఎస్ వర్గం వారు పేర్కొంటున్నారు.
News Posted: 2 June, 2009
|