ఫస్ట్ టైమర్ల హవా
న్యూఢిల్లీ : 15వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా మొదటిసారి ఎంపిలు అయిన పలువురికి పార్లమెంట్ సాదరపూర్వక స్వాగతం పలికింది. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ అయిన లోక్ సభలోకి ఎన్నికైన పురుష, మహిళా సభ్యులందరూ రంగురంగుల, రకరకాల దుస్తులు ధరించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలసి అడుగుపెట్టారు.
దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్నాటక నుంచి వచ్చిన ఎంపిలలో అనేక మంది సాంప్రదాయక దుస్తులు ధరించారు. మిత్రులు, పరిచయస్థులు చుట్టుముట్టడంతో వారు తమ కుటుంబ సభ్యులతో తమ అమూల్య క్షణాలు పంచుకోవడానికి ప్రయాస పడ్డారు.
ఆశ్చర్యంగా రెండవ సారి అధికారంలోకి వచ్చిన ఆనందం ముప్పిరిగొంటుండగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 'కొత్త ప్రారంభం' జరుగుతుందనే ఆశను వ్యక్తం చేశారు. 'మనం కొత్త ప్రారంభానికి నాంది పలకగలమని, పార్లమెంట్ సాఫీగా సాగనివ్వగలమని, చర్చలు, సంభాషణలు, హేతుబద్ధత మన సభా కార్యకలాపాలలో చోటు చేసుకోగలవని నేను ఆశిస్తున్నాను. తమ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతిపక్షానికి సముచిత గౌరవాన్ని మేము ఇవ్వగలం' అని పార్లమెంట్ లోకి ప్రవేశించే ముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ మందస్మిత వదనంతో చెప్పారు.
ఇక పలువురు ఎంపిలకు ఇది ఘనమైన కుటుంబ వ్యవహారం. తండ్రి - కుమారుడు, తండ్రి - కుమార్తె, తల్లి - కుమారుడు ఒకే లోక్ సభలో సభ్యులుగా గర్వంగా ప్రమాణస్వీకారం చేశారు. బహుశా ఈ 15వ లోక్ సభలో 'ఎన్నికైన బంధువుల' సంఖ్య అధికంగా ఉండడం విశేషం. వారికి ముందు వరుసలో చోటు దక్కేది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఆమె కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి. రాయబరేలి నుంచి సోనియా, అమేథి నుంచి రాహుల్ ఎన్నికయ్యారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె, మహారాష్ట్ర నుంచి తొలిసారిగా ఎంపిగా ఎన్నికైన సుప్రియా సూలె ప్రమాణ స్వీకారం చేస్తుండగా చెవులు అప్పగించి మరీ ఆలకించారు. ఆ కోవలోకే రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డి) అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి. అజిత్ తన ప్రియ పుత్రుడు జయంత్ ను తన పక్కనే ఆశీనుడయ్యేట్లు చూశారు.
డిఎంకె సభ్యులు, బంధువులు ఎం.కె. అళగిరి, దయానిధి మారన్ కూడా పక్కపక్కనే కూర్చున్నారు. ఎంపిలైన తండ్రీ కొడుకుల జాబితాలో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ నాయకుడు శిశిర్ అధికారి, ఆయన కుమారుడు శుభేందు అధికారి కూడా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి తమ మాతృభాష కన్నడలో ప్రమాణ స్వీకారం చేశారు.
News Posted: 2 June, 2009
|