మరో తెలంగాణ సంస్థ
హైదరాబాద్ : తెలంగాణ అంశంపై పలు మార్గాలను పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తిరుగుబాటు ఎంఎల్ సి కె. దిలీప్ కుమార్ 'తెలంగాణ విమోచన సమితి' (టివిఎస్) పేరుతో ఒక రాజకీయేతర సంస్థను సొంతంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థ ఆవిర్భావం గురించి ఈ నెల 18న ఆయన ప్రకటించవచ్చు.
ఆ రోజు భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలన ఆయన సంకల్పించారు. ఈ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇంతకుముందు నిర్వహించి సన్నాహక సమావేశం విజయవంతం కావడం నిర్వాహకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దానితో ప్రత్యేక రాష్ట్రం కోసం సరికొత్తగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించవచ్చుననే విశ్వాసం వారికి మరింతగా కలిగింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలలోని ప్రొఫెసర్లతో సహా ఈ ప్రాంతంలోని మేధావులతో వారు సంప్రదింపులు సాగిస్తున్నారు.
దిలీప్ కుమార్ వరంగల్లులో ఈ నెల 7 నుంచి పది రోజుల పాటు పాదయాత్ర సాగించనున్నారు. ఆయన నల్లగొండ, ఖమ్మం జిల్లాలను కూడా సందర్శిస్తారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను ఎందుకు పూనుకుంటున్నదీ తన శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ మూడు జిల్లాల ప్రజలకు ఆయన వివరిస్తారు.
టివిఎస్ ఆవిర్భావం గురించి లాంఛనంగా ప్రకటన చేసిన అనంతరం నిర్వాహక కమిటీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించిన ప్రధాన కోర్కెపై ఒత్తిడి పెంచేందుకు స్వల్ప కాలిక కార్యక్రమాలను ప్రకటించగలదు. ముందుగా రాష్ట్ర హోమ్ శాఖ మాజీ మంత్రి కె. జానారెడ్డి, ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులను తమ వైపు తిప్పుకొనే యత్నాలపై టివిఎస్ నాయకులు దృష్టి కేంద్రీకరిస్తారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని టిఆర్ఎస్ నుంచి కైవసం చేసుకునేందుకు కూడా టివిఎస్ ప్రయత్నిస్తుంది. ఈ దృష్టితోనే టివిఎస్ నిర్వాహకులు తెలంగాణపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేట్లుగా తెలుగు దేశం పార్టీ (టిడిపి)పై ఒత్తిడి పెంచుతారు.
News Posted: 3 June, 2009
|