సిఎం మాట బేఖాతరు
వరంగల్ : నిరాడంబరంగా ఉండాలని, అనవసర వ్యయం చేయవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పిలుపును ఆయన మంత్రివర్గ సహచరులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. వరంగల్ జిల్లాలో 'ఆర్భాటపు' ఊరేగింపుల కోసం వారు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.
జిల్లా రాజకీయాలలో ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుండే ఆ మంత్రులిద్దరూ తమ రాక సందర్భంగా బల ప్రదర్శన చేస్తూ వైభవోపేతంగా కార్యక్రమం నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరు మంత్రుల మద్దతుదారులు తమ తమ నాయకుల బ్యానర్లు, పోస్టర్లతో నగరం మొత్తాన్నీ నింపివేశారు. నగరంలోను, పరిసరాలలోను తమ తమ నాయకుల రంగురంగుల ఫ్లెక్సి బ్యానర్లను వేలాది సంఖ్యలో ఏర్పాటు చేశారు.
తన వద్దకు పూలమాలలతో రావద్దని, వాటికి బదులు ఆ డబ్బును ఆపన్నులను ఆదుకోవడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని తన మద్దతుదారులను, శ్రేయోభిలాషులను ముఖ్యమంత్రి ఇంతకుముందు కోరారు.
ఈ నెల 2న భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. కొత్తగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ, ఆమె భర్త, ఎంఎల్ సి ఒక అడుగు ముందుకు వేసి ఆ మరునాడే కనివినీ ఎరుగని బలప్రదర్శనతో నగరంలోకి ప్రవేశించారు. జనగామ నియోజకవర్గంలోని పెంబర్తి నుంచి మొదలై 60 కిలో మీటర్లు సాగిన ర్యాలీలో వందలాది వాహనాలను ఉపయోగించారు. వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది చలదన్నట్లు ఈ ఊరేగింపు సమయంలో ఒక ఆంబోతు స్వైర విహారం సాగించినప్పుడు ఒక కార్యకర్త మరణించగా ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు.
News Posted: 5 June, 2009
|