అసెంబ్లీ 'లైవ్ కట్'?
హైదరాబాద్ : జూలైలో బడ్జెట్ సమావేశాల నుంచి శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలకు పరిమితులు, సభ ప్రాంగణంలోకి మీడియా సిబ్బంది ప్రవేశంపై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తున్నది. మీడియాకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు 'లక్ష్మణ రేఖ' గీయాలని స్పీకర్ కు కాంగ్రెస్, ఎంఐఎం నుంచి విజ్ఞప్తులు అందాయి. ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలకు 500 మీడియా పాస్ లు జారీ చేయగా కొత్త అసెంబ్లీ తొలి సమావేశాలకు వెయ్యి పాస్ లు జారీ అయ్యాయి. పాస్ జారీపై సిఫార్సు చేసే మీడియా సలహా కమిటీ ఈ పెంపుదలకు కారణాన్ని వివరించలేకపోయింది.
మీడియాలో ప్రచారాన్ని ఎంతగానో ఇష్టపడే తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు కూడా గురువారం తమ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలోకి మీడియాను అడుగుపెట్టనివ్వలేదు. పార్టీ కార్యకలాపాలపై టిడిపి సీనియర్ శాసనసభ్యుల మధ్య వాగ్వాదంపై మీడియా వార్తలు పంపరాదని ఆయన కోరుకున్నారు.
ప్రెస్ గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలపై వార్తలు పంపే ప్రింట్ మీడియా సిబ్బంది కూడా కెమెరామన్ లు గ్యాలరీలో ఎక్కువ స్థలం ఆక్రమించుకోవడాన్ని నిరసించారు. ఇక సభ అంతటా మీడియా సిబ్బంది అధిక సంఖ్యలో కనిపిస్తూండడం, వారి ద్వారా కలుగుతున్న గందరగోళం పట్ల కూడా ఎంఎల్ఎలు చిరాకు పడ్డారు. ఎంట్రన్స్ సమీపంలో కూడా మీడియా గుమిగూడుతోంది. అక్కడ ఎంఎల్ఎలు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతుంటారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండు సూచనలు చేస్తున్నది. అవి: పార్లమెంట్ లో వలె అన్ని చానెల్స్ కు ఒకే ఫీడ్ ను అనుమతించాలి. మీడియా పాయింట్ ను వేరే ప్రదేశానికి తరలించాలి.
గురువారం సభా కార్యక్రమాల సలహా కమిటీ (బిఎసి)లో సభా కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు 'ఈ విధానంలో ఏ మార్పుల గురించైనా మీడియా సలహా కమిటీతో చర్చించగలం. మొత్తం అంశాన్ని పునఃపరిశీలిస్తాం' అని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి మీడియా అత్యుత్సాహం స్పీకర్ కే స్వయంగా అనుభవంలోకి వచ్చింది. పలువురు టివి, ప్రెస్ కెమెరామన్ లను ఫోటోలు తీసుకోవడానికై స్పీకర్ కార్యాలయంలోని బిఎసి సమావేశ మందిరంలోకి అనుమతించారు. వారి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయిన తరువాత తలుపులు మూసివేశారు. బిఎసి సమావేశం మొదలైంది. కాని ఇంతలో మరొక ఫోటోగ్రాఫర్ల బృందం లోపలికి వచ్చేందుకు తలుపులు తట్టింది. వారిని లోనికి రానివ్వవలసిందని స్పీకర్ సిబ్బందిని కోరారు.
News Posted: 5 June, 2009
|