నాగం, ఎర్రబెల్లి పోటీ
హైదరాబాద్ : ప్రధాన ప్రతిపక్షానికి దక్కనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి పేరును ప్రతిపక్ష నేత చంద్రబాబు దాదాపు ఖరారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ పదవికి తెలంగాణప్రాంతానికి చెందిన మరో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ పడుతుండడంతో చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న దయాకర్ రావు తనకు పిఎసి చైర్మన్ గా లేక ఉప నాయకుడిగా నియమించాలని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తనకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆయన చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నట్లు సమాచారం. కాగా పిఎసి చైర్మన్ పదవిని ఆశిస్తున్న దయాకర్ రావును, నాగం జనార్దన్ రెడ్డిని చంద్రబాబు తన కాన్వాయ్ లో కూర్చోబెట్టుకుని ఒక వివాహ కార్యక్రమానికి తీసుకువెళ్ళారు. మార్గమధ్యంలో వీరిరువురి మధ్య సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఎర్రబెల్లిని టిడిపిఎల్ పి ఉపనాయకుడిగా నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నప్పటికీ పార్టీలో కొందరు యువనేతలు ఒక వ్యక్తికి ఒక పదవినే ఇవ్వాలని తాజాగా పట్టుబట్టడంతో ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితులో ఉన్నారు. వాస్తవానికి టిడిపిఎల్ పి ఉపనేతలుగా ముగ్గురిని నియమించాలని తొలుత చంద్రబాబు భావించినప్పటికీ ఈ సంఖ్యను ఐదుకు పెంచి అందరినీ కొత్తవారి చేత భర్తీ చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు సూచించారు. పిఎసి చైర్మన్ పదవి నాగంకు దక్కుతుండడంతో విజయనగరం శాసనసభ నుండి ఏడవసారి ఎన్నికైన పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక గజపతిరాజును ఒక ఉప నాయకుడిగా నియమించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. రాయలసీమ ప్రాంతానికి చెంది కె.ఇ.కృష్ణమూర్తి పేరును ఉపనాయకుడు పదవికి ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించినప్పటికీ ఆయన ఈ పదవి పట్ల అంత ఆసక్తిని కనపరచలేదని తెలిసింది. దీంతో ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి ఎన్నికైన పార్థసారధి పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అనంతపురం జిల్లాకే చెందిన మరో యువ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ కూడా ఉపనాయకుడి పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఉపనాయకుడి పదవి ఎర్రబెల్లికి దక్కకపోతే మోత్కుపల్లి నర్సింహులును నియమించే ఆలోచన కూడా పార్టీ పరిశీలనలో ఉంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలవారీగా ఉపనాయకులను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. టిడిపిఎల్ పి కార్యదర్శి, కోశాధికారి, విప్ పదవులను ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. సీనియర్ శాసనసభ్యులైన బొజ్జల గోపాలరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పరసారత్నం, ఏలేటి అన్నపూర్ణమ్మ వీరిలో ఒకరిని కార్యదర్శి పదవిలో నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వనపర్తి నుంచి అసెంబ్లీకి మరోమారు ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డిని విప్ గా నియమించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. టిడిఎల్ పి ఉపనేతలుగా నలుగురిని నియమించాలని చంద్రబాబు యోచిస్తుండడంతో నాలుగో పదవి ఎవరికి దక్కనుందనే విషయంలో పార్టీలో చర్చ జరుగుతుంది.
News Posted: 5 June, 2009
|