కాంగ్రెస్ తో లెఫ్ట్ హల్చల్!
న్యూఢిల్లీ : ఇటీవలి ఎన్నికలలో అత్యంత ఘోరంగా ఓడిపోవడంతో సిపిఎంలో ఒక వర్గం వారు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కు చెందినవారు డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడరాదని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి ఆశిమ్ దాస్ గుప్తా రాష్ట్రంలో తుపాను బాధిత ప్రాంతాలలో పరిస్థితిపై మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతోను, హోమ్ మంత్రి పి. చిదంబరంతోను జరిపిన 'సకారాత్మక' సమావేశాల పట్ల ఈ వర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులతో వామపక్షాల నుంచి ఒక నాయకుడు జరిపిన తొలి సమావేశం ఇదే. మార్క్సిస్ట్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం పట్ల మార్క్సిస్ట్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సిపిఎం పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కావడానికై రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ ఈ నెల 19న జరపనున్న ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ నాయకుల దృష్టి కేంద్రీకృతమైంది. ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా కలుసుకోవచ్చు. దాస్ గుప్తా బెంగాల్ కు ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే కోరిన దృష్ట్యా ప్రధానితో భట్టాచార్జీ జరిపే సమావేశం అజెండాలో 'ఐలా తుపాను అంశం' ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఐలా తుపాను వల్ల వాటిల్లిన నష్టం నుంచి కోలుకోవడానికి మార్క్సిస్ట్ ప్రభుత్వానికి సాయం చేయడానికి కేంద్రం ఆసక్తితో ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి సంకేతం పంపిన వెంటనే ప్రధానితో భట్టాచార్జీ సమావేశం అవకాశాలపై వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రానికి అడ్వాన్స్ సహాయంగా రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేయడానికి ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం అంగీకరించినట్లు దాస్ గుప్తా తెలియజేశారు.
జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని కోరుతూ చిదంబరానికి దాస్ గుప్తా ఒక మెమోరాండాన్ని సమర్పించిన అనంతరం నష్టంపై అధ్యయనానికి రాష్ట్రానికి ఒక కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్రం నిర్ణయించింది.
కాగా, ఈ నెల 20, 21 తేదీలలో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం అనంతరం పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. రానున్న ఐదేళ్ళలో పార్టీ చేపట్టనున్న విధానపరమైన అంశాలపైన, కేడర్లలో తిరిగి విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు తీసుకోవలసిన చర్యలపైన ఈ సమావేశాలలో పార్టీ చర్చించవచ్చునని భావిస్తున్నారు.
News Posted: 5 June, 2009
|