అర్జున్ ముద్రకు స్వస్తి
న్యూఢిల్లీ : విద్యా రంగంపైన, మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖలోను వివాదాస్పద అర్జున్ సింగ్ ముద్రను తుడిచివేస్తున్నారు. ఉన్నత విద్యా రంగంలో అర్జున్ సింగ్ తీసుకున్న పలు చర్యలను సమీక్షిస్తున్నారు. వాటిని సవరించే అవకాశం ఉన్నది. పూర్వపు మంత్రివర్గంలో హెచ్ఆర్ డి మంత్రిగా ఉన్న అర్జున్ సింగ్ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాల పట్ల చిరాకు పడిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వాటిలో విద్య నాణ్యను దెబ్బ తీసే పలు నిర్ణయాలను పునఃపరిశీలించాలని నిశ్చయించారు.
ఈ దిశలో ప్రధాని తీసుకున్న తాజా చర్య పర్యవసానంగా అర్జున్ సింగ్ కు సన్నిహితుడుగా భావిస్తున్న ప్రొఫెసర్ ముంగేకర్ ప్రణాళికా సంఘంలో కొనసాగలేని స్థితి వచ్చింది. ప్రణాళికా సంఘంలో విద్యా వ్యవహారాలు చూస్తుండే ముంగేకర్ పేరు పునర్వ్యవస్థీకరించిన ప్రణాళికా సంఘం (పిసి)లో లేదు. యుజిసి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఇటి)ని సవరించేందుకు ముంగేకర్ అధ్యక్షతన ఒక కమిటీని అర్జున్ సింగ్ నియమించారు. విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల నియామకానికి ఈ పరీక్ష తప్పనిసరి. 2006లో కమిటీ సమర్పించిన తాత్కాలిక నివేదిక ఆధారంగా హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ ఈ తప్పనిసరి పరీక్ష నిబంధనను తొలగించింది. అయితే, హెచ్ఆర్ డిలో మంత్రి మార్పునకు కొన్ని రోజుల ముందు ఎన్ఇటి తప్పనిసరి అనే నిబంధనను కొనసాగించాలని ముంగేకర్ తన తుది నివేదికలో సూచించారు.
అర్జున్ సింగ్ పని తీరుపై ఆగ్రహం చెందిన మన్మోహన్ సింగ్ ఈ విషయాన్ని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి దృష్టికి తీసుకుపోయారు కూడా. ఆమె అర్జున్ సింగ్ భార్యను కలుసుకుని మంత్రి పదవికి రాజీనామా చేసి, మహారాష్ట్ర గవర్నర్ గా రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకునేట్లుగా ఆయనకు నచ్చజెప్పవలసిందిగా కోరారు. కాని అర్జున్ సింగ్ మంత్రిగా కొనసాగడానికే ఇష్టపడ్డారు.
ఈ మంత్రిత్వశాఖలో తన హయాం చివరి రోజులలో అర్జున్ సింగ్ కొత్తగా ఏర్పాటైన కేంద్ర విశ్వవిద్యాలయాలకు 15 మంది వైస్ చాన్స్ లర్ (విసి)లను నియమించేట్లు చూశారు. అన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలను విశ్వవిద్యాలయాలుగా ప్రకటించుకునేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. అర్జున్ సింగ్ హయాంలో చివరకు ఇటీవల ఏర్పాటైన విద్యా సంస్థలు కూడా జాతీయ గుర్తింపు, మదింపు మండలి (ఎన్ఎఎసి - నాక్) నుంచి ముందు గుర్తింపు లేకుండానే డీమ్డ్ యూనివర్శిటీల హోదాను సంపాదించుకోగలిగాయి.
News Posted: 7 June, 2009
|