జూనియర్లు చాలా ముదుర్లు
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం అటు పార్టీలోను, ఇటు శాసనసభా పక్షంలోను యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) సాగుతోంది. ఫలితంగా చంద్రబాబు చివరకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తరువాత కూడా శాసనసభా పక్షంలో ఉప నాయకుల జాబితాను సభాపతికి అందజేయలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 3 న మొదలయ్యాయి. చాలా రాజకీయ పక్షాలు తమ తమ శాసనసభా పక్ష నాయకుల పేర్లను ప్రకటించాయి. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) శాసనసభా పక్షం నాయకునితో పాటు ముగ్గురు ఉప నాయకుల పేర్లను సైతం విడుదల చేసింది. కాని టిడిపి ఇప్పటికే నాలుగు సార్లు టిడిఎల్ పి సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఉప నాయకులను ఖరారు చేయలేకపోతున్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు పక్కనే ఉండి సలహాలు ఇచ్చి ఈ పరిస్థితి తీసుకువచ్చినవారికే ఇప్పుడు కూడా పెద్ద పీట వేస్తున్నారని, పార్టీలో ఎటువంటి మార్పూ కనిపించడం లేదని జూనియర్లు విమర్శిస్తున్నారు. 'పార్టీ అధ్యక్షుడిని ఎలాగూ మార్చలేరు. ఆయన పక్కన ఉండేవారినైనా మార్చకపోతే ఇక పార్టీలో కొత్తదనం ఏమి ఉంటుంది. ప్రజలను ఎలా ఆకర్షిస్తాం' అని జూనియర్లు అంటున్నారు. నలుగురు శాసనసభా పక్ష ఉప నాయకులను నియమిస్తే వారిలో కనీసం ఇద్దరు సీనియర్లు, ఇద్దరు జూనియర్లు ఉండాలని వారి వాదన. స్పీకర్ ఎన్నిక సమయంలో అత్యంత సీనియర్ ఎంఎల్ఎ అని పి. అశోక గజపతి రాజుకు మాట్లాడే అవకాశం ఇస్తే ఏమైంది? చివరకు మనం సంజాయిషీ చెప్పుకునే విధంగా ఆయన మాట్లాడారని ఎంఎల్ఎలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేవిధంగా వ్యవహరిస్తే పార్టీ శ్రేణులు సైతం దూరమయ్యే ప్రమాదం ఉందని జూనియర్లు అంటున్నారు.
అయితే, యువతకు పెద్ద పీట అనే నినాదంతో సీనియర్లను పక్కన పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. సీనియర్ల వల్లే పార్టీకి నష్టం జరిగిందనుకుంటే, ఈ సూత్రం పార్టీ అధ్యక్షునికి కూడా వర్తించాలి కదా! అనేది నాయకులు కొందరి వాదన. కాని, చంద్రబాబు మాత్రం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే యువతకు ప్రాధాన్యం అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టిడిపి వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల తరువాత పార్టీని ప్రక్షాళన చేస్తారని ఆ వర్గాలు తెలిపాయి.
News Posted: 7 June, 2009
|