పిఎం ఆదేశంపై గుంజాటన
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పేర్కొన్న 'ప్రాధాన్యతలు, కార్యక్రమాల'ను దృష్టిలో పెట్టుకుంటూనే బడ్జెట్ కు రూపకల్పన చేయవలసిందన్న ప్రధాని 'ఆదేశం' ప్రభుత్వంలో కలకలం రేపుతున్నది. కనీసం ఒక మంత్రి అయినా ఇందుకు తన అసంతుష్టిని వ్యక్తం చేశారు.
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా జారీ అయిన ఈ ఆదేశం ఎవరికీ మింగుడు పడడం లేదు. ప్రధాని కార్యాలయం (పిఎంఒ) వెబ్ సైట్ లో ఈ ఆదేశాన్ని పొందుపరిచారు. మీడియా మేనేజర్లు దీని గురించి అందరి దృష్టికి ప్రత్యేకంగా తీసుకువస్తున్నరు. అయితే, రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే సంకేతాన్ని మంత్రివర్గానికి, అధికార యంత్రాంగానికి పంపడం దీని ఉద్దేశం అయినప్పటికీ ఈ సందేశం ఇచ్చిన తీరు మాత్రం మింగుడుపడడం లేదు.
ప్రధాని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్న తీరుకు ఒక మంత్రి అసంతృప్తి ప్రకటించినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. ప్రధానిగా రెండవ సారి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈవిధంగా ఆదేశాన్ని జారీ చేయవలసిన అగత్యం లేదని భావిస్తున్నారు. ఇంతకుముందు యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధిపత్యానికి వచ్చిన లోటు ఏదీ లేదు కదా అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను తదుపరి బడ్జెట్ ప్రతిబింబించేట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ చూడాలని ప్రధాని కోరుకుంటున్నారని సూచిస్తున్న పదజాలం చాలా మందిని అప్రతిభులను చేసింది. ఎవ్వరూ దారి మళ్ళకుండా ముందు జాగ్రత్త తీసుకునే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు.
బడ్జెట్ ను ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదిస్తున్నప్పటికీ ప్రధానికి, ఆర్థిక శాఖ మంత్రికి మధ్య సదా సంప్రదింపులు సాగుతూనే ఉంటాయి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు ఇందుకు భిన్నంగా జరుగుతుందనేందుకు కారణం కూడా లేదు. వాస్తవానికి రాష్ట్రపతి ప్రసంగం ప్రభుత్వ ప్రాథమ్యాలకు సూచిక కాగలదని చెప్పిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై ప్రధానితో రెండు సార్లు చర్చలు జరిపారు.
ఇప్పుడు అకస్మాత్తుగా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం మన్మోహన్ సింగ్ తత్వానికి విరుద్ధంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలపై ఆయన కచ్చితంగా వ్యవహరిస్తూనే సంఘర్షణ రహిత వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. ఆయన సరళ వైఖరినే ఆయన విజయ మంత్రంలో భాగంగా పరిగణిస్తూ వచ్చారు. ఆయన మరింత దృఢ వైఖరిని ప్రదర్శించాలని పార్టీలో కొందరు సహచరులు అభిప్రాయపడినప్పుడు ఆయన రాజకీయ శైలే ఆయనను రెండు సార్లు ప్రధానిని చేసిందని ఇతరులు వాదించారు.
News Posted: 9 June, 2009
|