సెలబ్రిటీలపై కస్టమ్స్ కన్ను
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రముఖులపై కస్టమ్స్ అధికారులు నిఘా వేసి ఉంచారు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ కు వెళుతున్నవారిని కూడా కస్టమ్స్ శాఖ వేయి కళ్ళతో గమనిస్తున్నది. అయితే, ఈ ప్రత్యేక నిఘా గురించి అధికారికంగా ఏ విషయమూ చెప్పడానికి కస్టమ్స్ శాఖ సీనియర్ అధికారి ఎవరూ సుముఖంగా లేరు. సెలబ్రిటీలు లేదా ప్రముఖులు విదేశాల నుంచి విలువైన వస్తువులను తీసుకువచ్చి వాటి గురించి వెల్లడి చేయకుండానే 'గ్రీన్ చానెల్' ద్వారా తప్పించుకుపోయే ప్రయత్నం చేయవచ్చునని ఇతర అధికారులు అంటున్నారు.
శీతల్ మఫత్ లాల్ కూడా లండన్ నుంచి తిరిగివస్తూ గ్రీన్ చానెల్ ద్వారా వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు ఆమె వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఒక్కటీ కొత్తది కాదని, ఇటీవల కొనుగోలు చేసినదీ కాదని మఫత్ లాల్ న్యాయవాది సతీష్ మాణెషిండె తెలియజేశారు. ఆ బంగారు ఆభరణాలు సొంతంగా వాడుకుంటున్నవని, వాటికి కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉందని ఆయన వాదించారు.
కాగా, ఐపిఎల్, టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు వెళ్లే ఉన్నత స్థాయి వ్యక్తులపై తాము నిఘా వేసి ఉంచినట్లు పేరు వెల్లడికి ఇష్టపడని కస్టమ్స్ అధికారి ఒకరు చెప్పారు. 'అనుమతించిన పరిమితికి మించి ఎవరూ నగదు తీసుకువెళ్ళకుండా మేము చూస్తున్నాం' అని ఆయన తెలిపారు. ఆ పరిమితి 5000 డాలర్లు. స్థానిక కరెన్సీలో అయితే రూ. 5000. 'అయితే, చాలా మంది ప్రముఖులకు అంతర్జాతీయ బ్యాంకులలో ఖాతాలు ఉన్నందున వారు విదేశీ నగరాలలో డబ్బు విత్ డ్రా చేస్తుంటారు' అని ఆ అధికారి తెలిపారు.
యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లో కొనుగోలు చేసిన వస్తువులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రిఫండ్ ను ఎవరైనా అడిగినట్లయితే తమకు తెలియజేయవలసిందిగా యుకెలోని కస్టమ్స్ అధికారులకు స్థానిక కస్టమ్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, మఫత్ లాల్ 4000 పౌండ్ల నుంచి 5000 పౌండ్ల వరకు విలువ చేసే సాధారణ వస్తువుల కొనుగోలుపై 800 పౌండ్ల మేరకు వ్యాట్ రిఫండ్ ను కోరినట్లు మాణెషిండె తెలియజేశారు. 'ఇది (కొనుగోలు మొత్తం) అంతగా లెక్కలోకి రాదు' అని ఆయన పేర్కొన్నారు.
News Posted: 10 June, 2009
|