దేవుని దగ్గుకు మనిషి వైద్యం
వారణాసి : ఆలయాల నగరం వారణాసిలో చివరకు దేవుళ్ళకు కూడా సుస్తీ చేస్తుంటుంది. వారికి ఆనువంశిక వైద్యులు చికిత్స చేస్తుంటారు. గత ఆదివారం వారణాసిలో సామాన్య ప్రజానీకం వడ దెబ్బను తప్పించుకోవడానికి ఇళ్ళకే పరిమితం కాగా జగన్నాథ స్వామి భక్తులు తనకు మరీ అతిగా చేసిన అభిషేకానికి దగ్గు, జలుబుతో 'బాధ' పడ్డాడు. దానితో ఒక యువ జ్యోతిష్కుడు వచ్చే 15 రోజులూ జగన్నాథునికి వైద్యుడుగా వ్యవహరిస్తారు.
ప్రతి సంవత్సరం పక్షం రోజుల పాటు అనారోగ్యంతో 'పడకవేసే' జగన్నాథ స్వామికి శ్రీరామ శర్మ (30) అనే పండితుడు వైద్యునిగా పాత్ర పోషిస్తుంటారు. 'ఏటా పక్షం రోజుల పాటు జగన్నాథునికి చికిత్స చేసే వైద్యుని పాత్ర పోషించడం మా కుటుంబం విధి. 300 ఏళ్ళనాటి జగన్నాథ ఆలయంలో ఆది నుంచి అర్చకులుగా మా కుటుంబ సభ్యులు ఉంటున్నారు' అని శ్రీరామ శర్మ తెలియజేశారు. తన తండ్రి సీతారామ శర్మ మరణంతో 1995లో ఆయన ఆలయ పూజారి అయ్యారు.
'ప్రతి సంవత్సర జ్యేష్ఠ పూర్ణిమ రోజు (ఈ సంవత్సరం ఆదివారం 7న వచ్చింది) భక్తులు ఆలయానికి తండోపతండాలుగా వచ్చి గంగాజలంతో స్వామికి అభిషేకం చేయిస్తారు' అని శర్మ తెలిపారు. 'నదీ జలాలతో అతిగా అభిషేకం చేయడం వల్ల భగవంతునికి సుస్తీ చేస్తుంది. దగ్గు, జలుబుతో ఆయన బాధ పడతాడు. అందువల్ల 15 రోజుల పాటు పడకవేస్తాడు' అనిశర్మ తెలిపారు. 'రెండు వారాల పాటు ఏలకులు, లవంగాలు, ఎండు మిర్చి, జైఫల్, గంగాజలం, గులాబ్ నీరు, తులసి, చందనం, భూరా చీనీలతో తయారు చేసిన కఢాను భగవంతునికి ఇస్తాం. ప్రతి సాయంత్రం అస్వస్థతతో బాధ పడుతున్న స్వామికి కఢా ఇచ్చిన తరువాత మిగిలినదానిని ప్రసాదంగా భక్తులకు పంచుతాం' అని శర్మ వివరించారు.
వైద్యునిగా శర్మ పాత్ర అక్కడితో ముగుస్తుంది. రెండు వారాల అనంతరం ఆ యువ పూజారి జగన్నాథస్వామి, ఆయన సోదరి సుభద్రా దేవి, సోదరుడు బలభద్రుని విగ్రహాల వెంట నగరంలో విహారానికి వెళతారు. అటుపిమ్మట దేవుళ్ళు ముగ్గురూ మూడు రోజుల పాటు రథయాత్ర చేస్తారు. అక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి అదృష్టం వరిస్తుందని ప్రతీతి.
News Posted: 10 June, 2009
|