రోశయ్యకు కళ్ళెం?
హైదరాబాద్ : శాసనసభ ఓ రాజ్యాంగ పరమైన సమస్యను ఎదుర్కోనుంది. రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి రోశయ్యరూపంలో ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకనుంది. శాసనసభలో సభ్యుడు కాని రోశయ్యకు వైఎస్ తన మంత్రి మండలిలో స్థానం కల్పించారు. ఆర్థిక శాఖతోపాటు శాసనసభా వ్యవహారాలమంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు. సభలో సభ్యుడు కాని ఒక వ్యక్తికి శాసనసభా నిర్వహణలో ఏ విధంగా అధికారాన్ని చెలాయిస్తారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ప్రశ్నించేందుకు సిద్ధపడుతోంది. చట్టసభలో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి పొందే అవకాశాలను రాజ్యాంగం కల్పించింది. పదవి చేపట్టిన ఆరు మాసాల్లోగా ఏదో ఒక చట్టసభకు ఆ వ్యక్తి ఎంపిక కావాల్సిన నిబంధన ఉంది. అయితే రోశయ్య కౌన్సిల్ సభ్యుడు కనుక మంత్రి అయ్యారు. అయితే శాసనసభ సభ్యుడు కాకుండా శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించడం రాజ్యాంగ పరంగా లేదా నైతికంగా ఎంతవరకు సబబు అన్నదే ధర్మసందేహం.
కేంద్రస్థాయిలో రాజ్యసభ, రాష్ట్రాల స్థాయిలో శాసనమండళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు కూడా మంత్రి మండలిలో అవకాశం పొందుతున్నారు. ఇలాంటి సభ్యులు ఇంతవరకుపార్లమెంటరీ లేదా శాసనసభా మంత్రిత్వ శాఖలను చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు. రాష్ట్ర స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లు అత్యున్నత స్పీకర్ స్థానాన్ని అధిష్ఠించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కండువాలను పక్కనపెడితే బాగుండునని టిడిపి సభ్యులు సూచించారు. శాసనసభలో టిడిపి చేసిన సూచనపై శాసనసభా వ్యవహారాలమంత్రి రోశయ్య మండిపడ్డారు. ఇలా సూచించే అధికారం వారికి లేదంటూ విరుచుకుపడ్డారు. అసలు సభలో సభ్యుడేకాని వ్యక్తి సభను అదుపుచేసే ప్రయత్నాన్ని నిలువరించాలని టిడిపి శిబిరంలో ఓ కొత్త ఆలోచన రేకెత్తించడానికి రోశయ్య వ్యవహారశైలే కారణమైంది.
కేంద్రంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ కూడా లోక్ సభలో సభ్యుడు కాదు. ఆయన రాజ్యసభనుంచి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. దీంతో మన్మోహన్ కు ప్రధాని పదవిని అప్పగించినా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా బాధ్యతలు లభించలేదు. ఈ బాధ్యతలను లోక్ సభ సభ్యుడైన ప్రణబ్ ముఖర్జీకి కట్టబెట్టారు. 15వ లోక్ సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రణబ్ ముఖర్జీయే వ్యవహరిస్తున్నారు. కేంద్రస్థాయిలో అమలుకాని విధానం మన రాష్ట్రంలో మాత్రం అమలుకావడం పట్ల టిడిపి సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అసలు రోశయ్యకు ఈ అర్హత ఉందా అంటూ ప్రశ్నించనున్నారు. ఇందుకోసం వారు రాజ్యాంగ నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు.
News Posted: 10 June, 2009
|