పదవులకోసం నిరీక్షణ
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినవారు, వివాదరహితులు, నాయకుల పట్ల విధేయత గలవారికే పదవుల కేటాయింపులో న్యాయం జరుగుతుందని ఒకటి, రెండు సందర్భాల్లో వై.ఎస్ సంకేతాలివ్వడంతో `అన్నా, సార్... ఇకనైనా మాపై దయ ఉంచండి. ఏదో దారి చూపిస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం' అంటూ పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. తొలి శాసనసభ సమావేశాలు కూడా ముగుస్తున్నాయి. గడచిన కొద్ది రోజులుగా కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని వైఎస్ చెబుతున్నప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి మాత్రం మాటవరుసకైనా మాట్లాడడం లేదు. మరోవైపు తమకు ఏదో ఒక పదవి రాకపోదా అన్న ఆశతో నాయుకులు, కార్యకర్తలు తమ తమ రాజకీయ గురువుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో 45 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, దాదాపు 287 డైరెక్టర్ల పదవులు ఉండగా వాటికోసం వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా ఇంకా అనేక పదవులున్నప్పటికీ దేని గురించీ కూడా నాయకత్వం ఇంత వరకు సీరియస్ గా ఆలోచించడం లేదు. అయితే ఎన్నికల్లో టిక్కెట్లురానివారు, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ విజయానికి కృషి చేసినవారు, వివాదరహితులు, నాయకుల పట్ల విధేయత గలవారికే పదవులకేటాయింపులో న్యాయం జరుగుతుందని ఒకటి, రెండు సందర్భాల్లో వైఎస్.డిఎస్ సంకేతాలిచ్చారు. గడచిన ఐదు సంవత్సరాలు, అంతకు ముందు దాదాపు పది సంవత్సరాల తెలుగుదేశం పాలనను కలుపుకుంటే మొత్తం 15 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తూ అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయ నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వైఎస్, డిఎస్ తో పాటు పార్టీ పట్లఉన్న విశ్వాసమే వారిని పార్టీని అంటిపెట్టుకుని ఉండేటట్టు చేస్తోంది. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పకనే చెబుతున్న వైఎస్ ఎవరికి పదవులు కట్టబెడతారో, ఎవరకి నిరాశ మిగులుస్తారో వేచి చూడాల్సిందే.
News Posted: 10 June, 2009
|