కాంగ్రెస్ లోకి నల్లపురెడ్డి?
హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. నల్లపురెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ముఖ్యంమంత్రిని కలిసేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు పార్టీల్లోనూ ప్రచారం సాగుతోంది. వైఎస్ ను కలిశాకే ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకుపడుతూ బహిరంగ ప్రకటనలు జారీ చేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రసన్నకుమార్ రెడ్డి వాలకం బట్టి చూస్తుంటే ఆయన అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుందని కూడా తెలుగుదేశం పార్టీలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ లేక అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలందరితో తాను తరచూ మాట్లాడుతున్నాననీ, వారు కూడా వారి వారి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను ఇస్తున్నారని అయితే ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఏ అంశం కూడా ఇంతవరకు తనతో చర్చించలేదనీ, అలాంటి వ్యక్తి బహిరంగంగా పత్రికలకు ప్రకటన జారీ చేయడంలో గల ఆంతర్యమేమిటో తనకు దోహదపడడం లేదని ఏదిఏమైనా ప్రసన్నకుమార్ రెడ్డిని పిలిచి తాను మాట్లాడతాననీ, అసలు జరిగిందేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు టిడిపిఎల్ పి భేటి సందర్భంగా చెప్పినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోగ్రూపు రాజకీయాలు, తగాదాలు కూడా ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీని వీడి వెళ్ళేందుకు మరో కారణంగా భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేదురుమల్లి వర్గం ఓటమి పాలవడంతో జిల్లాలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా తెదేపాకు చెందిన కొంతమంది సీనియర్ నేతలను పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే తొలిదశలో ప్రసన్నకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చంద్రబాబు అమెరికా వెళ్ళేలోపు ప్రసన్నకుమార్ రెడ్డితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని, అతనిని కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా నిరోధించడానికి పార్టీలో ప్రయత్నం కూడా కొనసాగుతుందని ఒక ముఖ్యనేత చెప్పారు.
News Posted: 10 June, 2009
|