ధర్మాన పక్కలో `శత్రు'చర్ల!
శ్రీకాకుళం : కొత్త కొలువు ప్రారంభమై ఇంకా పుంజెడు వారాలైనా కాలేదు. మంత్రుల మధ్య ఆధిపత్యం పోరు ప్రారంభమయ్యింది. వైఎస్ కేబినెట్లో తొలిసారే రాష్ట్ర రెవెన్యూ, రవాణా మంత్రులుగా పదవులు చేజిక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజులు మధ్య సయోధ్య ఎంతవరకు ఉందో తెలియదు గాని, కొద్ది గంటల ముందు బొబ్బిలి ఎస్.ఇ.సత్యన్నారాయణ బదిలీ వీరిద్దరి మధ్య అగాథం మాత్రం ఉందన్న వాస్తవాన్ని బట్టబయలు చేసింది. బొబ్బిలి సర్కిల్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 300 కోట్ల రూపాయలతో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోచేపడుతున్న కరకట్టల నిర్మాణపనుల పర్యవేక్షణ ఇంజనీర్ పై పడిన బదిలీ వేటు జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి చేరుకుండానే జరిగిపోయింది. పక్క జిల్లా నుంచి వలస వచ్చి పాతపట్నం నియోజకవర్గం నుంచి అసంబ్లీలో అడుగుపెట్టిన శత్రుచర్ల విజయరామరాజు రవాణామంత్రిగా తన హవాకు ఎస్.ఇ.బదిలీతో జిల్లాలో శ్రీకారం చుట్టారు. దీంతో శత్రుచర్ల వైఖరిపై ధర్మాన గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
ఆది నుంచి ధర్మాన ఉదాసీనతగా వ్యవహరించడంతో గత ప్రభుత్వంలో కూడా పక్క జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో ప్రతీ విషయంలో జోక్యం తప్పనిసరి అయ్యేది. ఆ తల నొప్పి ఒదుల్చుకోవడానికి ధర్మాన ఎటువంటి ప్రయత్నం అప్పట్లో చేయకపోవడంతోనే ఇప్పుడు ఆ మంత్రితో పాటు, శత్రుచర్ల జోక్యం కూడా ప్రారంభమయ్యింది. అయితే, బొబ్బిలి ఎస్.ఇ. బదిలీ విషయం నిన్న ఉదయానికి గాని మంత్రి ధర్మాన్నకు వంశధార ఇంజనీర్లు కొంత మంది సమాచారం అందించారు. దీంతో ఆయన ఎస్.ఇ సత్యన్నారాయణ బదిలీవేటుపై పున:పరిశీలించేలా ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారుడుకే నేరుగా చెప్పినట్లు సమాచారం.
అతిమంచిగా వ్యవహరించే మంత్రి ధర్మాన అజమాయిషీ లేకుండా చేసేందుకు పన్నిన పన్నాగంలో బొబ్బిలి ఎస్.ఇ.బలిపశువుగా మారనున్నారన్న వాదన ఆ శాఖ సిబ్బంది నుంచే వెలువడుతోంది. అందుకే జిల్లాతో సంబంధం ఉన్న ఒక ఎస్.ఇ. పై వేటు వేసేముందు జిల్లా మంత్రి ధర్మాన దృష్టికి వెళ్లకుండానే ఇద్దరు మంత్రులు తమ శక్తిని వినియోగించారన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి ధర్మాన నేరుగా ముఖ్యమంత్రి సలహాదారుడు దృష్టికి తీసుకువెళ్ళి ఎస్.ఇ. బదిలీ నిలుపుదల చేయాలంటూ కోరినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పటికైనా జిల్లా మంత్రి ధర్మాన ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించకుంటే, అనవసర జోక్యం పెరిగి అధికారులు ఇరకాటంలో పడే ప్రమాదం లేకపోలేదు.
News Posted: 10 June, 2009
|