`నాగం' పొడిచారు!
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి నిర్వాకం వల్లే జిల్లాలో అలంపూర్, గద్వాల, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయామని తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మక్తల శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా ఆంజనేయులు లేదా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును ఎంపిక చేసి ఉంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిఉండేదని ఆయన నిన్న అసెంబ్లీ లాబీలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నియోజకవర్గ టిక్కెట్ ను ఐపిఎస్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్ కు ఇవ్వడం వల్లే ఈ నియోజకవర్గంలో టిడిపి ఘోరంగా ఓడిపోయిందిని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నియోజకవర్గ టిక్కెట్ ను ఆంజనేయులుకు ఇవ్వాలని తాము చంద్రబాబు నాయుడిని కోరామనీ, అయితే నాగం జనార్ధన్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకుని తన పెత్తనం చెలాయించారని, ఆయన ఎంపిక చేసిన అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. గద్వాల నియోజకవర్గంలోనూ నాగం మితిమీరి జోక్యం వల్లే అక్కడ కూడా పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారని చెప్పారు. ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ను ఆశించిన గట్టుభీముడు, వెంకటాద్రిరెడ్డిని సమన్వయం చేసుకొని వారు పార్టీని వీడి వెళ్లకుండా చర్యలు తీసుకొని ఉంటే కృష్ణమోహన్ రెడ్డి సులువుగా గెలిచి ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 11 లేదా 12 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచివుండేవారని ఆయన అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈ దఫా ఎన్నికల్లో ఒత్తిళ్ళకు తలొగ్గేదనీ, గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను ఇవ్వడంతో రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాల్లో తమ జిల్లాలో పార్టీ అభ్యర్థులు గెలిచి రికార్డులు సృష్టించారని చెప్పారు.
షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ను టిడిపికి కేటాయించి ఉంటే ఊహించని మెజారిటీ వచ్చి ఉండేదని, ఈ నియోజకవర్గంలో తెరాస బలం అంతంత మాత్రంగానే ఉందని ఆయన అన్నారు. తన సతీమణి సీతాదయాకర్ రెడ్డి పోటీ చేసిన దేవరకద్రలో రెబల్ అభ్యర్థిగా రావుల రవీంద్రనాథరెడ్డి పోటీ చేయకుండా ఉండి ఉంటే సీతకు మరో పదివేలు అదనంగా మెజారిటీ వచ్చి ఉండేదని అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రామ్మెహన్ రెడ్డి ఓడిపోతారన్న విషయం తనకు ముందే తెలుసుననీ, దేవరకద్ర నియోజకవర్గంలోనూ విజయం ముందే ఊహించిందని ఆయన చెప్పారు.
News Posted: 10 June, 2009
|