జూనియర్లకు దండిగా పని
న్యూఢిల్లీ : తమ క్యాబినెట్ మంత్రుల వద్ద నుంచి బాధ్యతల అప్పగింతను కోరేందుకు ఒక యూనియన్ ను ఏర్పాటు చేయాలేమో అని సహాయ మంత్రులు భావించిన రోజులు గతించి ఉండవచ్చు. కేంద్రంలో వరుసగా నాలుగు మంత్రివర్గాలలో పని కోసం వెంపరలాడిన అనంతరం జూనియర్ మంత్రులు తాము నిరుద్యోగులం కామని ధీమాతో ఉండేంతగా పని సంపాదించబోతున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలలోగానే జూనియర్ మంత్రులు కొందరికి చక్కటి బాధ్యతల కేటాయింపు జరిగింది. ఇతరులకు ఆమేరకు హామీలు లభించాయి. వీరు ఈ విషయంలో నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రారంభ సూచికలను బట్టి ఈ మంత్రివర్గం ఆనందమయమైన మన్మోహన్ కుటుంబంలా భాసించవచ్చు.
'నేర్చుకోవడానికి, పని చేయడానికి, విధాన నిర్ణయంలో పాలు పంచుకోవడానికి నాకు తగినన్ని అవకాశాలు ఇచ్చారు' అని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా వద్ద సహాయ మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద సంతోషంగా చెప్పారు. జితిన్ ప్రసాదకు మార్కెటింగ్ బాధ్యతలు అప్పగించారు. ఈ కీలక మంత్రిత్వశాఖలో దీనిని ముఖ్యమైన బాధ్యతగా పరిగణిస్తున్నారు.
ఇక భారీగా నిధులు ఖర్చు చేసే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సి.పి. జోషి తన జూనియర్ సహచరులు ప్రదీప్ జైన్, శిశిర్ అధికారి, అగాథా సంగ్మా విషయంలో ఇదే విధంగా ఉదారంగా వ్యవహరించారు. జైన్ కు గ్రామీణాభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. జైన్ కాంగ్రెస్ సభ్యుడు కాగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన శిశిర్ అధికారి, ఎన్ సిపికి చెందిన అగాథా సంగ్మాలకు కూడా చెప్పుకోదగిన బాధ్యతలే లభించాయి. అధికారి భూమి వనరులు, సంగ్మా మంచినీటి సరఫరా బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
సునిశితమైన హోమ్ (ఎంహెచ్ఎ), విదేశాంగ (ఎంఇఎ) శాఖల క్యాబినెట్ మంత్రులు పాకిస్తాన్ లేదా టెర్రరిజం వంటి ముఖ్యమైన బాధ్యతలను వదలుకునే అవకాశం లేదు. కాని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం తన జూనియర్లు ఎం. రామచంద్రన్, అజయ్ మాకెన్ లకు చెప్పుకోదగిన బాధ్యతలనే అప్పగించారు. ఇంకా పనుల అప్పగింత జరగని జూనియర్లకు కూడా ఇది శుభసూచకం కాగలదు. ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ. రాజా కింద సహాయ మంత్రిగా ఉన్న సచిన్ పైలట్ ఈ విషయంలో ఆందోళన చెందడం లేదు. వాస్తవానికి వార్టన్ సంస్థలో చదువుకున్న సచిన్ పైలట్ పెద్ద ఆలోచనలతోనే ఉన్నారు. 'ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి ఇండియా బయట పడడానికి ఐటి విశేషంగా దోహదం చేస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో కాల్ రేట్లు చౌక కాగా, ఫోన్లు మాత్రం ఇంకా ప్రజలకు అందుబాటులో లేవు. భౌగోళికంగా లేదా సామాజికంగా దూరంగా ఉన్న వర్గాలకు అందుబాటులోకి రావలసి ఉంటుంది' అని సచిన్ పైలట్ అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 10 June, 2009
|