హమ్మయ్య! బాబు నవ్వారు!
హైదరాబాద్: ‘బాబు నవ్వారు. ఈ సారి సభలో కనిపించిన కొత్త పరిణామం ఇదే. 13వ శాసన సభ తొలి సమావేశానికి ఇదే ప్రత్యే కత’ అని కాంగ్రెస్ శాసన సభా పక్షం (సీఎల్పీ) పేర్కొంది. గవర్నర్ ప్రసంగానికి విపక్షాల ధన్యవాద తీర్మానం అనంతరం చర్చలో పాల్గొన్న వైఎస్ తన ప్రసంగం ద్వారా రాజకీయ నాయకుడిగా పరిణితి చాటారని సీఎల్పీ స్పష్టం చేసింది. శాసన సభ సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వ విప్‌లు కొండ్రు మురళిమోహన్, డాక్టర్ శైలజానాథ్‌లతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క్ బుధవారం సాయంత్రం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి నవ్వు ఈ సారి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఇది మేము చెప్పడం లేదని, టీడీపీకి చెందిన సభ్యులే చెబుతున్నారని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన ఆంశాలపై సభా నాయకుడిగా వైఎస్ ఎంతో చక్కగా సమాధానం చెప్పారని ఆయన కొనియాడారు.
విశ్వసనీయత- వంచనకు, అభివృద్ధి- ఆటంక వాదుల మధ్య జరిగిన మొన్నటి ఎన్నికల్లో జనం విశ్వసనీయతకే పట్టం పట్టారని, గత ఐదేళ్ళుగా వైఎస్ ప్రభుత్వ తీరును గమనించిన జనం రెండవసారి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని ఆయన తెలియజేస్తూ ఇందుకు రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశ్వసనీయత లేకుండానే సభలో చర్చ ప్రారంభించారని, విశ్వసనీయత పెంచుకోవాలంటూ వైఎస్‌ను సూచిస్తూ బాబు నవ్వారని, ఆయన నవ్వడాన్ని చూస్తుంటే బాబు చెప్పిన దాంట్లో కూడా విశ్వసనీయత లేదని కనిపించిందని విక్రమార్క్ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ, అందులో వాడిన పదాలను చూస్తుంటే పార్టీ నేతలకే బాబుపై విశ్వసనీయత లేదని తేటతెల్లవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
News Posted: 10 June, 2009
|