అద్వానీపై 'మిత్ర' కోపం
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం అందుకు బాధ్యతను నిర్థారించే విషయంపైన, ఆ నాయకులకు కీలక పదవులు కేటాయిస్తుండడంపైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర నాయకత్వం నిలువునా చీలిపోయింది. రాజ్యసభలోని మాజీ ప్రతిపక్ష నాయకుడు జశ్వంత్ సింగ్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు పార్టీ ప్రముఖులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, రాజనాథ్ సింగ్ లోపాయికారీగా మద్దతు ఇస్తున్నారు. అరుణ్ జైట్లీ ఉత్థానం పట్ల వారంతా కలవరం చెందుతున్నారు. జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా ప్రకటించిన విషయం విదితమే.
ఎగువ సభలో ప్రతిపక్ష నాయకునిపదవిలో నుంచి తనను తొలగించడం పట్ల జశ్వంత్ సింగ్ ఆగ్రహం చెందారు. పరాజయానికి కారణాలను శోధించకుండా, వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తూ, పరాజయానికి కారణాలను విశ్లేషిస్తుండడం ఇతర నాయకులకు మింగుడు పడడం లేదు. జైట్లీ, సుధీంద్ర కులకర్ణి వార్తాపత్రికలలో తమ అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ శౌరి ప్రశ్నించారు. అరుణ్ శౌరి వాదనతో పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ఏకీభవిస్తూ, వారు పార్టీ వేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. రాజనాథ్ ముఖ్యంగా అద్వానీకి సన్నిహిత సహచరుడు, పార్టీ వ్యూహకర్త కులకర్ణిని వ్యతిరేకిస్తున్నారు. అద్వానీని సమర్థించనందుకు కులకర్ణి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను విమర్శించారు.
ఆ నాయకులందరి ఆగ్రహం మౌలికంగా అద్వానీపైనే. అద్వానీ ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేయకపోవడాన్ని, ఎన్నికలలో పరాజయానికి బాధ్యత వహించకపోవడాన్ని వారు నిరసిస్తున్నారు. అంతేకాకుండా జైట్లీని అద్వానీ ప్రతిపక్ష నాయకుని పదవిలో నామినేట్ చేయడమే కాకుండా సుష్మా స్వరాజ్ ను లోక్ సభలో డిప్యూటీ లీడర్ గా నియమించారు. జైట్లీని చివరకు పార్టీ అధ్యక్ష పదవి కూడా అప్పగిస్తారేమోనని వారు భయపడుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులలో ఎం. వెంకయ్య నాయుడు మినహా మిగిలినవారికి అద్వానీ తీరు నచ్చడం లేదు. రాజనాథ్ సింగ్ స్థానంలో పార్టీ అధ్యక్షుడు కావాలనే ఆశతో వెంకయ్య నాయుడు ఉన్నారు.
News Posted: 12 June, 2009
|