టిడిపికి తెరాస గుడ్ బై?
హైదరాబాద్ : ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలుగు దేశం పార్టీ (టిడిపి)తో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని, మహా కూటమి నుంచి బయటకు రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
టిడిపితో సంబంధాలను తెంచుకోవాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు పార్టీ నాయకులు పలువురు సలహా ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)కి జరగనున్న ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతో ఎటువంటి పొత్తూ పెట్టుకోరాదనే అభిప్రాయంతో వారు ఉన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశంలో పొత్తు అంశంపై చర్చించిన అనంతరం టిడిపితో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా తెరాస లాంఛనంగా ఒక ప్రకటన చేయగలదు.
కాగా, ఎన్నికలలో పరాజయానికి కారణాల శోధనకై ఈ వేర్పాటువాద పార్టీ తెలంగాణ భవన్ లో నియోజకవర్గాల వారీగా జరుపుతున్న సమీక్ష సమావేశాలు గురువారం రెండవ రోజు కూడా కొనసాగాయి. మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఫలితాలను ఈ సమావేశంలో సమీక్షించారు. చంద్రశేఖరరావుకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జి. విజయరామారావు, ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
జిహెచ్ఎంసి ఎన్నికలలో పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని కొందరు నాయకులు సూచించారు. టిడిపి నాయకత్వం పొత్తుకు విరుద్ధంగా వ్యవహరించిందని వారిలో కొంత మంది ఆరోపించారు. 'వరంగల్ లో టిడిపి నాయకత్వం వైఖరి కారణంగా మనం ఆరు అసెంబ్లీ సీట్లను, ఒక లోక్ సభ సీటును కోల్పోయాం' అని తెరాస వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు పి. సుదర్శన్ అభిప్రాయం వెలిబుచ్చారు. 'మనం సొంతంగానే పోటీ చేసి ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలను సాధించి ఉండేవారం' అని ఆయన అన్నారు.
మహా కూటమి ప్రయోగం ఈ ప్రాంతంలో విఫలమైందని పార్టీ ఉపాధ్యక్షుడు నాయని నరసింహారెడ్డి కూడా చెప్పారు.
News Posted: 12 June, 2009
|