తిరుపతికి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ వే
తిరుపతి : పుణ్యక్షేత్రం తిరుపతిలో మౌలిక వసతుల పరంగా గణనీయమైన మార్పులు సంభవించనున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జెఎన్ఎన్ యుఆర్ఎం)కు చెందిన మిషన్ నగరాల జాబితాలో తిరుపతిని కూడా చేర్చడం ఇందుకు దోహదం చేయనున్నది.
తిరుపతి మునిసిపల్ కమిషనర్ పి. మోహనరెడ్డి గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2005లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నగర అభివృద్ధి ప్రణాళిక ఆధారంగా జెఎన్ఎన్ యుఆర్ఎం కింద కార్పొరేషన్ కు రూ. 1389 కోట్ల మేరకు కేంద్ర నిధులు అందగలవని తెలియజేశారు.
దేశంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా తిరుపతిని తీర్చిదిద్దడానికి జెఎన్ఎన్ యుఆర్ఎం నిధులతో పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టాలని కార్పొరేషన్ సంకల్పించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై పూర్ణకుంభం కూడలి నుంచి కపిలతీర్థం జంక్షన్ వరకు మూడు కిలో మీటర్ల మేరకు 'ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే' కూడా ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో భాగంగా ఉన్నది. ఈ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే వల్ల తిరుమలకు వెళ్ళే యాత్రికులు నగరంలో అత్యంత జనసమ్మర్దం గల కూడళ్ళను తప్పించుకుని నేరుగా అలిపిరికి వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. ఎక్స్ ప్రెస్ వే కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించవలసిందిగా చెన్నై ఐఐటిని కోరారు.
కొండ కారణంగా ఉత్తరం వైపు విస్తరణకు అవకాశం లేని కారణంగా దక్షిణంవైపు నగరం శీఘ్రగతిని విస్తరిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్ నగర ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ఎం.ఆర్. పల్లి, ఎఐఆర్ బైపాస్ రోడ్డు, మహతి ఆడిటోరియం మీదుగా ఒక ఫ్లై ఓవర్ ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఫ్లై ఓవర్ ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఐఐటి చెన్నై ఒక అధ్యయనం నిర్వహించగలదు. శ్రీనివాసం నుంచి ఎపిఎస్ఆర్ టిసి సెంట్రల్ బస్ స్టేషన్ వరకు ఒక సబ్ వేను నిర్మించాలని కూడా కార్పొరేషన్ యోచిస్తున్నది. నగరం విస్తరణ ప్రాంతాలలో రోడ్లు, వీధి దీపాలు, మంచి నీటి సరఫరాను అభివృద్ధి చేయడం, 310 కిలో మీటర్లు పొడుగునా డ్రెయినుల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలను కూడా జెఎన్ఎన్ యుఆర్ఎం నిధులతో చేపట్టనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ తరహాలో తిరుపతి కార్పొరేషన్ ను గ్రేటర్ తిరుపతిగా మార్చడానికై నగరం చుట్టుపట్ల గల 39 గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించినట్లు కమిషనర్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదముద్ర పొందిన తరువాత కార్పొరేషన్ ఈ గ్రామాలలో జెఎన్ఎన్ యుఆర్ఎం కింద మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టగలదని ఆయన చెప్పారు.
News Posted: 12 June, 2009
|