కెసిఆర్ దిగివచ్చినా...
హైదరాబాద్ : ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలోఆశావహులకు టిక్కెట్ల కేటాయింపులో తాను పొరపాట్లు చేసిన మాట నిజమేనని అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఇక మీదట పార్టీ కార్యకర్తలు, నాయకుల సలహాలు వినడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ పార్టీలో ఆయన విమర్శకులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. వారు మరింతగా భీష్మించుకుంటూ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని పట్టుబట్టుతున్నారు.
ఎన్నికలలో టిఆర్ఎస్ ఘోర పరాజయానికి గురైనప్పటి నుంచి కెసిఆర్ వ్యతిరేక వర్గం ఇదివరకటి కన్నా ధైర్యం పుంజుకుంది. ఆయన వ్యవహార శైలిని బాహాటంగానే విమర్శిస్తున్నది. ఆ వర్గంలో తాజాగా మాజీ శాసనసభ్యుడు ఎ. చంద్రశేఖర్ చేరారు. రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటున్నవారికి ఆయన మద్దతు పలికారు. కాగా, కెసిఆర్ శుక్రవారం హైదరాబాద్ లో విలేఖరుల గోష్ఠిలో మాట్లాడినప్పుడు తాను పొరపాట్లు చేసినట్లు అంగీకరించారు. పార్టీ కార్యకర్తల మాట వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఇంతకుముందు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారికి కెసిఆర్ ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి పార్టీలోకి 'తిరిగి రావలసిందిగా' విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ నెల 10 నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలను కెసిఆర్ నిర్వహిస్తున్నప్పటికీ వాటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యమనే అభిప్రాయాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు విలువ లేదని, పార్టీ అధినేత అడుగులకు మడుగులొత్తేవారినే వీటికి పిలుస్తున్నారని ఇతర అసమ్మతి నాయకులు విమర్శించారు. ఎన్నికలలో పార్టీ ఓటమి అనంతరం కెసిఆర్ పై ముందుగా టిఆర్ఎస్ ఎంఎల్ సి దిలీప్ కుమార్ ధ్వజం ఎత్తారు. తెలంగాణ విమోచన సమితి (టివిఎస్) అనే సంస్థను దిలీప్ ఏర్పాటు చేశారు.
రాష్ట్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు మాత్రమే పార్టీ బలహీనతలేమిటో తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని నాయని నరసింహారెడ్డి, డాక్టర్ కె. విజయరామారావుతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం అసమ్మతివర్గం నాయకులు ఎన్.ఎం. శ్రీనివాసరెడ్డి (మహబూబ్ నగర్), జె. బాలకృష్ణారెడ్డి (నల్లగొండ), ఉమా దేవి (హైదరాబాద్), డాక్టర్ చంద్రశేఖర్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఒక సమావేశం నిర్వహించారు. కెసిఆర్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని, కాని అలా చేయడానికి ఆయన వెనుకాడుతున్నందున ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు అంటున్నారు.
News Posted: 13 June, 2009
|