`రాజ్యం'లో టిడిపి చిచ్చు
హైదరాబాద్ : అధికారంలోకి కచ్చితంగా వస్తామని భావించి ఫలితాల అనంతరం డీలా పడ్డ ప్రజారాజ్యం పార్టీలో టిడిపి చిచ్చు రగులుతోంది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవాలని కొందరు ప్రజారాజ్యం పార్టీ నాయకులు చేస్తున్న ఆలోచన కొంతమంది పిఆర్పీ నాయకులకు ఆగ్రహం కలిగించింది. పార్టీ సీనియర్లతో నేడు పిఆర్పీ అధినేత చిరంజీవి ఏర్పాటు చేసిన సమావేశంలో టిడిపితో పొత్తు అంశంపై నిలదీయాలని కొందరుసీనియర్లు నిర్ణయించారు. పిఆర్పీ నాయకుడు టి దేవేందర్ గౌడ్ గురువారం విలేఖరుల సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయం పట్ల పిఆర్పీ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న సంకేతాలిచ్చే విధంగా పరోక్షంగా దేవేందర్ గౌడ్ విలేఖరుల సమావేశంలో చెప్పడం వారి ఆగ్రహానికి కారణంగా ఉంది.
అయితే శుక్రవారంనాడు దేవేందర్ గౌడ్ మళ్ళీ దీనిపై వివరణ ఇస్తూ, తన అభిప్రాయం అది కాదని, కొంతమంది తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, టిడిపితో పొత్తు విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై పార్టీలో అసలు ఎటువంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో చిరంజీవి వైఖరిని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ముద్ర పడగా ఇప్పుడు టిడిపితో పొత్తు అంశంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టిడిపితో పొత్తు పెట్టుకోవడం కన్నా ఆ పార్టీలో విలీనం కావడం మంచిదని వ్యంగ్యంగా వారంటున్నారు. అసలు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా అయితే ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది అని వారంటున్నారు. పిఆర్పీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ అధినేత చిరంజీవికి ఈ విషయంలో ఘాటుగా లేఖ రాయాలని భావించినట్లు సమాచారం. అయితే లేఖ రాయడం కన్నా నేరుగా చిరంజీవితోనే ఈ అంశంపై తేల్చుకోవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం.
ఒక రాష్ట్రంలో మూడు ప్రధానమైన పార్టీలున్నప్పుడు ఒక పార్టీ వెళ్ళి మరో పార్టీతో ఎలా కలుస్తుందని చిరంజీవి మీడియా అడిగిన ప్రశ్నకు అసహనంగా సమాధానం చెప్పారు. ప్రదాన ప్రాంతీయ పార్టీలు జతకట్టిన దాఖలాలు ఎక్కడా లేవని, అలాంటిది టిడిపితో పిఆర్పీ పొత్తు ఎలా సాధ్యమని కూడా ఆయన ప్రశ్నించారు. సిపిఎం, సిపిఐ, లోక్ సత్తా పార్టీలతో కలిసి స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోలేదని ఆయన వివరించారు. అలాగే బిజెపీతో జతకట్టేది లేదని చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు.
ఇలా ఉండగా కాంగ్రెస్, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా రాజకీయ వ్యూహం రూపొందించాలి తప్ప రాజకీయంగా పార్టీని నాశనంచేసే ఆలోచనలు మానుకోవాలని ఆ పార్టీలో కొందరు సీనియర్లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వామపక్షాలు, తెరాస, చివరికి బిజెపితో కూడా పొత్తు పెట్టుకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి వీలుంటుందని, అంతే తప్ప టిడిపితో పొత్తు పెట్టుకోవడం కంటే పార్టీని రద్దు చేయడమే మేలని కొందరు పిఆర్పీ నాయకులు దెప్పిపొడుస్తున్నారు.
News Posted: 13 June, 2009
|