టిడిపికి కష్టకాలం?
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో గడ్డు పరిస్థితినే ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ అనుకూల వైఖరిని అనుసరించడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో టిడిపి ఘోర పరాజయానికి గురైంది. గతంలో టిడిపికి బాసటగా నిలిచిన సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు.
ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ను చీల్చిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. కాని విచిత్రంగా జిహెచ్ఎంసి ఎన్నికలలో పసుపు రంగు పార్టీ (టిడిపి)తో ఎటువంటి పొత్తూ పెట్టుకోరాదని గులాబి రంగు పార్టీ (టిఆర్ఎస్) నిశ్చయించింది.
ఇది ఇలా ఉండగా, మూకుమ్మడిగా సెటిలర్ల మద్దతును సంపాదించాలనే ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వారికి టిఆర్ఎస్ సమస్యలు సృష్టిస్తున్నదని ఆరోపించింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ప్రకటించడం జిహెచ్ఎంసి ఎన్నికలలో తనకు నష్టదాయకం కాగలదని తెలిసినప్పటికీ తెలంగాణ అంశంపై టిడిపి తిరిగి పట్టుబట్టాలనుకుంటున్నది. అయితే, పార్టీకి మరొక మార్గం లేదు. ఇప్పుడు పార్టీ తన విధానాన్ని మార్చుకున్నా ప్రజలు పార్టీని విశ్వసించబోరు. తనతో సంబంధాలను టిఆర్ఎస్ దాదాపుగా తెంచుకోవడంతో టిడిపి ఇతర మిత్ర పక్షాల కోసం చూస్తోంది. నగరపాలక సంస్థ ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమే. వామపక్షాల పరిస్థితి కూడా అదే.
క్రితం సంవత్సరం అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ సమైక్య ఆంధ్ర వాదంతో ప్రచారం చేసి సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు. కాని ఇటీవలి ఎన్నికలలో టిడిపి తెలంగాణకు అనుకూల వైఖరిని అనుసరించిన తరువాత తలసానిని కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ ఓడించారు.
'జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇంకా కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేదు. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడంపై ఏ నిర్ణయాన్నైనా తగినంత చర్చ జరిపిన తరువాతే పార్టీ తీసుకోగలదు' అని టిడిపి నాయకుడు ఒకరు తెలియజేశారు.
News Posted: 13 June, 2009
|