సికే రూటే సెపరేటు
తిరుపతి : చిత్తూరు కాంగ్రెస్ శాసనసభ్యుడుగా ఎన్నికైన సికె జయచంద్రారెడ్డి (సికె బాబు) రూటే సెపరేటు. రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయ పరిచేవిధంగా ఆయన తన శాసనసభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని ఆయన కాని, ఆయన వర్గీయులు కానీ ధృవీకరించడం లేదు. తనకు మంత్రి పదవి ఖాయమని సికె బాబు భావించారు. అయితే వైఎస్ మంత్రి వర్గంలోస్థానం లభించలేదు. దీంతో సికె బాబు ఒక విధంగా నిర్వేదానికి మరోవిధంగా ఆవేదనకు, ఆగ్రహానికి కూడా గురి అయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, టిటిడి చైర్మన్ పదవిలో వుంటూ తన గెలుపుకు సహకరించాల్సిన డికె ఆదికేశవుల నాయుడు తనను ఎన్నికల్లో ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నించడమే కాకుండా నేరచరిత్ర గల వ్యక్తినంటూ ప్రచారం చేయడాన్ని సికె జీర్ణించుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాకపోయినా డికె నిర్వహిస్తున్న టిడిపి ఛైర్మన్ పదవిని అయినా తనకు ఇచ్చి ఆయనను తొలగించాలని వైఎస్ కు సంకేతాలను పంపించారు.ఇందుకు కూడా వైఎస్ నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో సికె మరింత ఆవేదనకు గురి అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తన నిరసనను వైఎస్ కు గట్టిగా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.ఇందులో భాగంగా గత నెల 29న రాయలసీమ అభివృద్ధి మండలి బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు. అటు తరువాత ఈ నెల 4న అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి డుమ్మాకొట్టి వైఎస్ కు మలి నిరసన తెలియజేశారు. మరో అస్త్రంగా తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతను కూడా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సికె చివరి అస్త్రంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు పంపారు. అందులోనూ మరో 48 గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు రానున్న నేపథ్యంలో తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి వైఎస్ కు సవాల్ విసరడానికేనన్నట్లు తెలుస్తోంది.
సికె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకుంటే ఆయనకు అత్యంత సన్నిహితులైన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి భూమన్ కరుణాకర్ రెడ్డిలకు బుజ్జగించే బాధ్యతలను సిఎం అప్పగించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సికె చిత్తూరు శాసనసభ్యుడిగా 1989లో మొదటిసారిగా స్వతంత్ర్య అభ్యర్దిగా గెలుపొందారు. అటుతరువాత 1994లో జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1999లో కూడా గెలుపొంది వరుస విజయాలతో హాట్రిక్ సాధించారు. అటు తరువాత 2004లో టిక్కెట్ రాలేదు. ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సికె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన రెండుసార్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. తాను గెలిచిన ఈ సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు పదవి లభించకపోగా తన బద్ధశత్రువుల హవా కొనసాగడం సికె జీర్ణించుకోలేక రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా సికెబాబు రాజీనామా వ్యవహారం జిల్లాలాలోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా తయారైంది.
News Posted: 13 June, 2009
|