సానియా ఇద్దరు పిల్లల తల్లి!
హైదరాబాద్ : సానియా మీర్జా నిశ్చితార్థం కంటితుడుపు చర్య మాత్రమే. ఆమెకు ఇప్పటికే పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సమాచారం ఇది. నమ్మితే నమ్మండి. అంతే.
పౌర సరఫరాల శాఖ జారీ చేసిన రేషన్ కార్డు ప్రకారం హైదరాబాదీ టెన్నిస్ మేటి సానియా విజయనగరం జిల్లా వేపాడు పట్టణ వాసి లక్ష్మీనారాయణను వివాహం చేసుకున్నది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ కుటుంబం వ్యాపారం చేస్తుంటుంది. అయితే, సానియాకు సంబంధించి కొంతలో కొంత మేలు ఏమిటంటే రేషన్ కార్డుపై ఫోటో సానియాదే అయినప్పటికీ పేరు మాత్రం ప్రసన్న లక్ష్మి అని ఉంది.
ప్రభుత్వ పంపిణీ వ్యవస్థపై శనివారం ఉదయం సచివాలయంలో సమీక్ష జరిగినప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువచ్చారు.
అయితే, సానియా కుటుంబం ఇందుకు ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇంగ్లండ్ లో ప్రస్తుతం ఆడుతున్న, వింబుల్డన్ కు ముందు ఫామ్ లోకి వస్తున్న తన కుమార్తె సానియా ఏకాగ్రతను ఇటువంటి 'చిన్న విషయాలతో' దెబ్బ తీయరాదని ఇమ్రాన్ మీర్జా అన్నారు.
అసలు రాష్ట్ర జనాభా 8.5 కోట్లు కాగా, రేషన్ కార్డు డేటా ప్రకారం ఇది 9.8 కోట్లు ఉంటుందని మంత్రి విలేఖరులతో చెప్పారు. సుమారు కోటి 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు కనిపిస్తున్నాయని, వీటి వల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) జనాభా 6.7 కోట్లు అని విదితమవుతోందని, కాని వాస్తవంగా బిపిఎల్ జనాభా . 8.5 కోట్లు మాత్రమేనని మంత్రి చెప్పారు.
బిపిఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులను, మిగిలినవారికి గులాబి రంగు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. బోగస్ కార్డులు చాలా వరకు తెల్ల కార్డులే. తెల్ల కార్డుల వల్ల కిలో రెండు రూపాయల బియ్యం, ఇందిరమ్మ సబ్సిడీ గృహవసతి పథకం, ఆరోగ్యశ్రీ ఆరోగ్య, బీమా పథకం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సాలీనా కిలో రూ. 2 బియ్యం పథకం పైన దాదాపు రూ. 3500 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకంపైన రూ. 1325 కోట్లు, ఇందిరమ్మ పథకం పైన రూ. 5000 కోట్లు వెచ్చిస్తుంటుంది. కిలో రూ. 2 బియ్యం పథకం కింద ఐదుగురు సభ్యుల కుటుంబానికి 25 కిలోల బియ్యం సరఫరా చేస్తారు.
News Posted: 14 June, 2009
|