మాయకు కొత్త సవాల్
న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి తన రాష్ట్రంలోనే మరొక సవాల్ ఎదురుకానున్నది. ఈ నెల 19న వచ్చే కాంగ్రెస్ యువ నేత, ఎంపి రాహుల్ గాంధి జన్మదినాన్ని అవకాశంగా తీసుకుని ఉత్తర ప్రదేశ్ లో బిఎస్ పి దళిత వోటు బ్యాంకుకు గండి కొట్టడానికి కాంగ్రెస్ వ్యూహం పన్నుతున్నది. తమ పార్టీ 19ని 'సామరస్య దినం'గా పాటించనున్నట్లు, ఆ సందర్భంగా దళితుల ప్రాబల్య ప్రాంతాలలో సహపక్తి భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు యుపిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో నూతనోత్తేజాన్ని పొందిన కాంగ్రెస్ 2012లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి లభించే అవకాశాలను ఏమాత్రం వదలుకోబోమని, శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఆ రోజు సహపంక్తి భోజనాల కార్యక్రమంలో అన్నికుల, మత, వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొంటారు. దీనిని కాంగ్రెస్ తరహా 'సోషల్ ఇంజనీరింగ్'గా పరిగణిస్తున్నారు.
గత 20 సంవత్సరాలుగా అథఃపాతాళంలో ఉన్న ఈ ప్రధాన హిందీ భాషా రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో తాజా ఎన్నికల ఫలితాలతో పునరుత్థానం పొందుతున్న తరుణంలో ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సంకల్పించింది. రెండు సంవత్సరాల క్రితం మాయావతి ఒంటి చేత్తో తన పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించిన దృష్ట్యా తాజా ఎన్నికలలో పార్టీకి గణనీయంగా సీట్లు లభించడం గమనార్హం. దేశ రాజకీయాలలో చెప్పుకోదగిన పరిణామంగా దీనిని పరిగణిస్తున్నారు.
'కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నట్లయితే ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా సీట్లను గెలుచుకోవలసి ఉంటుంది' అని రాహుల్ గాంధి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 'ఈ నెల 19న నిర్వహించదలచిన ఇతర కార్యక్రమాలలో యువజన కాంగ్రెస్ రోడ్ షో కూడా ఉంది. యువజన కాంగ్రెస్ ఆ రోజును 'యువ ప్రేరణ దివస్'గా పాటించనున్నది. ఎన్ఎస్ యుఐ ఒక 'రథం'ను ఉపయోగిస్తూ 'యువత, ప్రజాస్వామ్యం' అనే అంశంపై రోడ్ల పక్క చర్చలను నిర్వహిస్తుంది. వారు విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేస్తారు' అని రీటా బహుగుణ జోషి తెలియజేశారు.
కాంగ్రెస్ అనుబంధ సంస్థ సేవా దళ్ ఆ రోజును 'సంకల్ప్ దివస్' గా పాటించనున్నది. ఆ సందర్భంగా వివిధ కార్యక్రమాలను సేవా దళ్ నిర్వహిస్తుంది. అయితే, మహిళా కాంగ్రెస్ తన కార్యక్రమాన్ని ఇంకా ప్రకటించవలసి ఉంది.
News Posted: 14 June, 2009
|