దొరికిన బూట్ల దొంగ
బెర్లిన్ : జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఫోరెన్ పట్టణంలో వందకు పైగా షూలను కొట్టేసిన దొంగ మిస్టరీని అధికారులు ఎట్టకేలకు ఛేదించారు. ఒక నక్క వాటిని దొంగిలించిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఒక నక్క గుహ సమీపంలో చెల్లాచెదురుగా పడివున్న షూలు ఒక అటవీ శాఖ ఉద్యోగి కంట పడ్డాయి. నక్క గుహ లోపల ఆ పాదరక్షల గుట్టను ఆ ఉద్యోగి చూశారు. పట్టణ వాసుల ఇళ్ళ వెలుపల ఉన్న షూలు ఇటీవల చోరీ అయ్యాయి.
'ఆడవాళ్ళ షూల నుంచి ట్రెయినర్ల షూల వరకు రకరకాల షూలు అక్కడ ఉన్నాయి' అని స్థానిక పోలీస్ శాఖ అధికార ప్రతినిధి తెలియజేశారు. 'మాకు ఇంత వరకు 110, 120 మధ్య షూలు కనిపించాయి. తన పిల్లలు ఆడుకోవడం కోసం ఆడ నక్క వాటిని దొంగిలించినట్లున్నది' అని ఆయన పేర్కొన్నారు.
చాలా షూలకు లేస్ లు కనిపించలేదు. కాని షూలు వాడుకునే స్థితిలోనే ఉన్నాయని, వాటి సొంతదారులు అవి తిరిగి దొరకడం పట్ల ఆనందం ప్రకటించారని ఆ ప్రతినిధి తెలిపారు. దొంగపై చర్య తీసుకునే ఆలోచన లేదని ఆయన చెప్పారు.
News Posted: 14 June, 2009
|