రాజ్ చేతిలో పావు సిన్హా?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) హజారీబాగ్ ఎంపి యశ్వంత్ సిన్హా పార్టీలో అన్ని పదవులకు చేసిన రాజీనామాను ఆమోదించాలన్న పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ నిర్ణయం సిన్హాతో సహా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమపై చర్య తీసుకుంటారని ఊహించకుండానే చాలా మంది అసమ్మతి గళం వినిపిస్తుంటారు.
రాజనాథ్ కు కఠినంగా వ్యవహరించడం తప్ప మార్గాంతరం లేకపోయింది. ఇందుకు యశ్వంత్ సిన్హాయే ప్రాతిపదిక కల్పించారు. పార్టీ సభ్యులు ఎవరైనా పార్టీ వేదికలలోనే తమ అభిప్రాయాలు వెల్లడి చేయాలి తప్ప మీడియా వద్దకు వెళ్ళరాదంటూ శనివారం ఒక విలేఖరుల గోష్ఠిలో విస్పష్టంగా ప్రకటించడానికి బిజెపి అధ్యక్షుడు సన్నద్ధం అవుతుండగా యశ్వంత్ సిన్హా లేఖలోని అంశాలను వెల్లడి చేయడం ద్వారా ఒక టివి న్యూస్ చానెల్ వారి వ్యూహాన్ని దెబ్బ తీసింది.
అయితే, సిన్హా రాసిన నాలుగు పేజీల లేఖలోని అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే బహిర్గతం చేశారని పార్టీలో ఒక వర్గం విశ్వసిస్తున్నది. రెండవ దఫా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న రాజనాథ్ అవకాశాలకు ఎన్నికలలో పార్టీ ఓటమితో విఘాతం కలగడంతో ఆ ఓటమి నుంచి జనం దృష్టిని మరలించే ఉద్దేశంతో ఈ లేఖాంశాలను బహిర్గతం చేసి ఉండవచ్చు. మరి కొందరు నాయకులు కూడా యశ్వంత్ సిన్హా బాటలో నడవవచ్చునని సూచిస్తూ వెలువడిన వార్తలు కూడా రాజనాథ్ చర్యకు కారణమై ఉండవచ్చునని పార్టీ సభ్యులు భావిస్తున్నారు.
ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం గురించి ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ విధంగా కఠిన చర్య తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. విలేఖరుల గోష్ఠిలో సమర్థించుకుంటున్నట్లుగా రాజనాథ్ మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీయడమే కాకుండా యశ్వంత్ సిన్హా లేదా జశ్వంత్ సింగ్ తరహాలో వ్యవహరించాలనుకుంటున్నవారికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది.
తనను గాని, ఎల్.కె. అద్వానీని గాని నిలదీసిన వారి గురించి రాజనాథ్ ప్రకటనలో ప్రస్తావనే లేదు. 'ఇక మీదట క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడే పార్టీ సభ్యులపై చర్య తీసుకోగలం' అని రాజనాథ్ తన ప్రకటనలో స్పష్టం చేయడం పార్టీలో 'మూడ్'ను బహిర్గతం చేస్తున్నది.
News Posted: 15 June, 2009
|