తమ్మినేని ఉక్కిరి బిక్కిరి!
శ్రీకాకుళం : ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో తమ్మినేనికి మరో షాక్ తగిలింది. దివంగత నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబునాయుడు వంటి నేతల పక్కన ఉంటూ సూచనలు, సలహాలు ఇచ్చే తమ్మినేని సీతారాంకు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తి లేదంటూ కొట్టిపారేసిన పిఆర్పీ జిల్లా నాయకుల హెచ్చరికలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మాట కోసమే నిలబడతానంటూ తన మిత్రుడు కింజరాపు ఎర్రన్నాయుడితోనే విభేదించి టీ కప్పులో తుఫాను కాదు... సముద్రంలో సునామీ సృష్టిస్తానంటూ మూడు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న తమ్మినేనికి పీఆర్పీతో ఆరు మాసల అనుబంధం కూడా తెగిపడేలా ఉంది. కేవలం వ్యక్తుల మధ్య, జిల్లా నేలతల మధ్య జరిగిన వివాదం కాదది. అధిష్ఠానం పునరాలోచనతో పనిలేకుండా ఆయన చేసే ప్రకటనలు జిల్లా పీఆర్పీలో ప్రకంపనలు పుట్టించాయి.
ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని సీతారాంపై అదేపార్టీకి చెందిన జిల్లా నాయకులు ముప్పేట దాడి చేశారు. పార్టీ నిర్ణయనిబంధనలకు నీళ్లొదిలేసి, నియంతృత్వ పోకడలతో సీతారాం వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా పిఆర్పీ కన్వీనర్ డోల జగన్, టెక్కలి అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత అసెంబ్లీ ప్రాంగంణంలో చేసిన ప్రకటనను అర్థం చేసుకోకుండా తన స్వీయాభిప్రాయాలను పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని తమ్మినేని సీతారాంపై వారు ఆరోపించారు.
టెక్కలిలో ఆదివారం జరిగిన రేవతీపతి సంస్మరణ సభకు ప్రజారాజ్యం పార్టీకి ఆహ్వానం లేదని వారు స్పష్టం చేశారు. తమ్మినేనికి దివంగత రేవతీపతి బంధువైతే, ఆయన వెళ్ళడం మాకు అభ్యంతరం లేదని, అయితే పార్టీ నిర్ణయాలు ఆ సభలో వెల్లడి చేయడం తమ్మినేని జిల్లాలో పార్టీ నేతలను అవమానపరచడమేనని జిల్లా కన్వీనర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే టెక్కలి అసెంబ్లీ పరిధి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై పునరాలోచన చేయమంటూ అధినేత చిరంజీవిని ఇక్కడి నేతలంతా వేడుకున్నారు. అత్యున్నత స్థాయిలో రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం జరగకముందే తమ్మినేని తన అభిప్రాయాలను పార్టీపై రుద్దాలని ప్రయత్నించడం వెనుక కుట్ర దాగి ఉందని కన్వీనర్ తో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొంత మంది ఆరోపించారు. జిల్లాలో రాజకీయంగా ఎదుగుతున్న తమ లాంటి నాయకులను అణిచివేయడానికే తమ్మినేని ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని వారు తీవ్రంగా దుయ్యబట్టారు.
News Posted: 16 June, 2009
|