చీపుర్లు పట్టిన అగ్ర వర్ణాలు
లక్నో : రాహుల్ ఉపాధ్యాయ 26 సంవత్సరాల బ్రాహ్మణుడు, హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అధ్యాపకుడు కావాలని కలలు కన్నాడు. కాని ఆ కల సాఫల్యం కాలేదు. ప్రస్తుతం అతను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు పశ్చిమంగా 200 కిలో మీటర్ల దూరంలోని ఎటాహ్ జిల్లా మూసావలి గ్రామంలో ఒక స్వీపర్ గా పని చేస్తున్నాడు. అతని జీతం నెలకు రూ. 7000. గ్రామీణ యుపిలో ఇప్పటికీ అదే పెద్ద మొత్తమే. 'నా ఉద్యోగానికి ఢోకా లేదు' అని అతను చెప్పాడు.
25 సంవత్సరాల సంజయ్ సింగ్ రాజపుత్ ఆధిపత్యం చలాయించే లోధ్ అనే ఒక వెనుకబడిన కులం (బిసి)కి చెందినవాడు. బిఎస్ సి (ఆనర్స్) పట్టా పొందాడు. కొన్ని నెలల క్రితం వరకు అతను గుర్గాఁవ్ లో ఒక కంప్యూటర్ విక్రయ సంస్థలో టెస్టింగ్ ఇంజనీర్ గా పని చేసేవాడు. కాని ఇప్పుడు అతను తన ఐటి సాధనాలు వదలివేసి చీపురు పట్టాడు. లక్నోకు పశ్చిమంగా 220 కిలో మీటర్ల దూరంలోని కాన్షీరాం నగర్ జిల్లా హన్స్ పూర్ గ్రామంలో అతను జీవిక కోసం వీధులు ఊడుస్తుంటాడు, డ్రెయిన్లు శుభ్రం చేస్తుంటాడు.
ఇలా చేస్తున్నది ఉపాధ్యాయ, రాజపుత్ మాత్రమే కాదు. సాంప్రదాయకంగా దళితులు చేస్తుండే స్వీపర్, పారిశుద్ధ్య కార్మికుల పనులను వేలాది మంది బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియాలు, కాయస్థులు, లోధ్ లు, యాదవులు, ముస్లింలు నిర్వర్తిస్తున్నారు. దీనిని ఆర్థిక మాంద్యం ప్రభావంగా పేర్కొనవచ్చు. నిరుద్యోగులుగా ఉండవలసి వస్తుందనే భయమే చివరకు విద్యాధికులను, అగ్ర వర్ణాలను, బలాధిక్యం గల బిసి యువజనులు భద్రమైన, ఈ చిన్న చిన్న ఉద్యోగాలను చేపట్టడానికి దారి తీస్తున్నది.
మాయావతి ప్రభుత్వం గ్రామాల కోసం లక్ష మంది పారిశుద్ధ్య కార్మికులను ఎంపిక చేయడం ప్రారంభించినప్పుడు ఈ ధోరణికి నాంది పడింది. తమ కొత్త వృత్తి పట్ల చాలా మంది ఏమాత్రం ఇరకాటానికి గురి కావడం లేదు. 'ఏ పని కూడా చిన్నది కాదు. ఏమైనా మేమేమీ బిచ్చమెత్తుకోవడం లేదు, దొంగతనం చేయడం లేదు' అని రాజపుత్ చెప్పాడు.
పారిశుద్ధ్య బాధ్యతలు నిర్వహించడానికి అగ్ర వర్ణాలను రిక్రూట్ చేయాలన్న మాయావతి ప్రభుత్వం ప్రతిపాదన వల్ల యుపి గ్రామాలలో మొత్తం కుల సమీకరణాలు, సామాజిక వ్యవస్థ మారిపోవచ్చు.
News Posted: 17 June, 2009
|