తత్కాల్ రేట్లు తగ్గవచ్చు
న్యూఢిల్లీ : రైల్వే శాఖ కొత్త మంత్రి మమతా బెనర్జీకి తత్కాల్ పథకం గురించి పలు అభ్యర్థనలు అందాయని, వాటి విషయం పరిశీలించవలసిందిగా తన శాఖ అధికారులను ఆమె కోరారని రైల్వే మంత్రిత్వశాఖ వర్గాలు తెలియజేశాయి. రైలు తరగతి, డిమాండ్ ఆధారంగా తత్కాల్ బెర్త్ లు రూ. 75, రూ.300 మధ్య ఎక్కువ రేటుకు లభిస్తుంటాయి. రైలు బయలుదేరడానికి ముందు ఐదు రోజు ల పాటు తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ను అనుమతిస్తుంటారు. బుకింగ్ వ్యవధిని మరింత తగ్గిస్తే ప్రజలకు తక్కువ రేట్ల టిక్కెట్లు మరింతగా పొందే అవకాశాలు ఇతోధికంగా ఉండగలవని, తత్కాల్ చట్టబద్ధం చేసిన ఏజెంట్ల వ్యవస్థ అనే అపప్రథ నుంచి రైల్వే శాఖకు విముక్తి కలగగలదని వాదన కూడా వినిపిస్తున్నది.
అయితే, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ మౌలిక ప్రయాణికుల చార్జీలను రైల్వే శాఖ హెచ్చించని కారణంగా తత్కాల్ టిక్కెట్లకు ఎక్కువ రేటు వసూలు చేయడం సబబేనని రైల్వే మంత్రిత్వశాఖలో కొందరు అధికారులు వాదిస్తున్నారు. తత్కాల్ టిక్కెట్లకు ఎక్కువ బుకింగ్ వ్యవధి కేటాయిస్తే ప్రయాణికులకు టిక్కెట్లు కొనడానికి ఎక్కువ వీలు ఉంటుందని, బ్లాక్ మార్కెటీర్లను ఆశ్రయించకుండా చూడవచ్చునని కొంత మంది అధికారులు సూచిస్తున్నారు.
తన హయాంలో చివరి మూడు సంవత్సరాలలో లాలూ ప్రసాద్ యాదవ్ తత్కాల్ సీట్ల సంఖ్యను రెండింతలకు పైగా పెంచారు. మామూలు రిజర్వేషన్ల పరిధిలోని బెర్త్ లలో నుంచి ఈ అదనపు తత్కాల్ సీట్లను కేటాయిస్తున్నారు. దీనితో చౌక టిక్కెట్లను ప్రయాణికులు ముందుగా కొనడం కష్టం అవుతున్నది. 2005 - 06లో తత్కాల్ కోటాలో రోజువారీ సగటు బెర్త్ ల సంఖ్య 43 వేలుగా ఉన్నది. ఆ తరువాతి సంవత్సరం లాలూ యాదవ్ దానిని 57 వేలకు, 2007 - 08 సంవత్సరంలో 98 వేలకు పెంచారు.
తత్కాల్ టిక్కెట్ల ద్వారా రైల్వేలకు ఆదాయం 2006 - 07లోని రూ. 200 కోట్ల నుంచి 2007 - 08 సంవత్సరంలో దాదాపు రెట్టింపు అయింది. అంటే రూ. 396 కోట్లకు పెరిగింది. ఈ ఆదాయం 2008 - 09 సంవత్సరంలో రూ. 500 కోట్ల మేర ఉన్నది. ప్రస్తుతం ప్రయాణికులు తత్కాల్ కోటా కింద వెయిట్ లిస్ట్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. తుది రిజర్వేషన్ చార్ట్ తయారు చేసినప్పుడు రైల్వే శాఖ జనరల్ కోటాకు, తత్కాల్ కోటాకు మధ్య ఖాళీ బెర్త్ లను 1:1 నిష్పత్తిలో పంచుతుంది.
అయితే. జనరల్ వెయిట్ లిస్ట్ తత్కాల్ వెయిట్ లిస్ట్ కన్నా పెద్దదిగా ఉంటుంది కనుక తత్కాల్ వెయిట్ లిస్ట్ లోని ప్రయాణికులకు నిర్థారిత టిక్కెట్ దొరికే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ ప్లానింగ్ ప్రయాణికులను తత్కాల్ టిక్కెట్ల కొనుగోలుకు ప్రోత్సహిస్తుంటుంది. అయితే, ఈ నిష్పత్తిని మార్చాలా వద్దా అనేది మమతా బెనర్జీ ఇంకా నిర్ణయించవలసి ఉంది.
News Posted: 17 June, 2009
|